
ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుంటే స్థలాల స్వాధీనం
విజయనగరం అర్బన్: గృహ నిర్మాణ పథకాల కింద గతంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరైన ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి చేయని లబ్ధిదారులంతా వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) వెంకటరమణ సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అదనపు సహాయాన్ని వినియోగించుకొని ఆయా లబ్ధిదారులంతా తమకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని లేని పక్షంలో ఆ ఇళ్ల స్థలాలు స్వాధీనం చేసుకొని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించే నిమిత్తం గృహ నిర్మాణ సంస్థ జీఎం శుక్రవారం పలు మండలాల్లో పర్యటించారు. నెలిమర్ల మండలం సీతారాంపేట, బొంపల్లి మండలం గొట్లాం, బొబ్బిలి మండలం పారాదిలో ఇళ్ల కాలనీలను సందర్శించి ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ కార్యాలయంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఈఈ, డీఈలతో గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని నిర్మాణాలకు ఈ సీజన్ అనుకూలంగా ఉన్నందున లబ్ధిదారులతో అధికారులు నేరుగా మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించాలని సూచించారు. జిల్లాలో 11,648 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 4,649 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన 6,999 ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట గృహనిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జి.మురళీమోహన్ తదితర అధికారులు ఉన్నారు.
గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేక అధికారి
వెంకటరమణ