
బాలల ప్రతిభకు వేదిక బాలభవన్
● వేసవిలో ఉచిత శిక్షణకు అనూహ్య
స్పందన
● పలు కళల్లో తర్ఫీదు పొందుతున్న 550 మందికి పైగా చిన్నారులు
● 32 సంవత్సరాలుగా సేవలు
● వేసవి శిక్షణకూ ఇతర జిల్లాల విద్యార్థుల హాజరు
రాజాం : రాజాంలోని మెంతిపేటలో ఉన్న బాలభవన్ బాలల ప్రతిభను వెలికితీసే వేదికగా మారింది. పలు కళా రంగాల్లో మక్కువ ఉన్న చిన్నారులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా పేరు తెచ్చుకుంటుంది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ జవహర్ బాలభవన్‌ను ఇక్కడ 1993 జూన్ 4న ప్రారంభించారు. అప్పట్లో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించిన ఈ కేంద్రం ఇప్పుడు సొంత భవనాలతో పాటు ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. మ్యూజిక్, డ్యాన్స్ రంగాల్లో కేంద్రం ప్రారంభంలో ఇక్కడ శిక్షణ ఉండేది. ఇప్పుడు 16కి పైగా కళా రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పాటు వేసవిలో రాజాం వచ్చే ఇతర ప్రాంతాల విద్యార్థులకు మంచి వేదికగా ఇక్కడ బాలభవన్ వేసవి శిక్షణా తరగతులు నిలుస్తున్నాయి.
ఏమి నేర్పుతున్నారంటే..
గత నెల 24న బాలభవన్‌లో వేసవి శిక్షణా శిబిరాన్ని రాజాంకు చెందిన పలువురు ప్రముఖుల చేతులు మీదుగా డైరెక్టర్ సుంకరి రమేష్ ప్రారంభించారు. ఈ వేసవిలో ఉచితంగా చిన్నారులకు మ్యూజిక్, డ్యాన్స్, తబలా, నాట్యం, సంగీతం, ఆర్ట్స్, టైలరింగ్ వంటి విద్యలలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. శిక్షణ నిమిత్తం 550 మంది విద్యార్థులు ఈ ఏడాది ఇక్కడ చేరారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు నృత్యం, సంగీతం శిక్షణలో ఉన్నారు. ఇక్కడి విద్యార్థులు ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు పొందుతున్న సందర్భాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 200లకు పైగా బాలభవన్‌లు, 47 బాల కేంద్రాలు పని చేస్తుండగా, రాజాం బాలభవన్‌కు ప్రత్యేకత ఉంటుంది. మొత్తం 16 మంది ఉపాధ్యాయులు ఈ వేసవిలో ఇక్కడ చిన్నారులకు తర్పీదునిస్తున్నారు.
చాలా ఆనందంగా ఉంది..
రాజాంతో పాటు చీపురుపల్లిలో జవహర్ బాలభవన్ కేంద్రాలు ఉన్నాయి. ఎంతో కష్టపడి ఈ కేంద్రాలను నిలబెట్టాం. రాజాం బాలభవన్‌కు మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన చిన్నారులు టీవీ షోల్లో సంగీతం, నృత్యం వంటి రంగాల్లో పాల్గొనే అవకాశం పొందారు. కొంతమంది ప్రైవేట్ ఈవెంట్‌లు చేస్తూ రాణిస్తున్నారు. వేసవిలో చిన్నారులు సమయాన్ని వృథా చేసుకోకుండా కాలాన్ని ఆహ్లాదకరంగా సద్వినియోగం చేసుకునేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది.
– డాక్టర్ సుంకరి రమేష్, డైరెక్టర్, బాలభవన్
550 మందికి పైగా విద్యార్థులు
రాజాం బాలభవన్ వేసవి శిక్షణలో అనూహ్య స్పందన కనిపిస్తుంది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు రకాల వినోద ప్రదర్శనల్లో తన సత్తాను చాటుతున్నారు. బాలభవన్ జాతీయ వేడుకల్లో ఇక్కడ బాలభవన్ గత 2018 నుంచి మూడు పర్యాయాలు ప్రథమ స్ధానాన్ని సాంస్కృతిక కళా రంగాల ప్రదర్శనలో నిలిచింది. దీంతో వేసవి శిక్షణ కార్యక్రమాల్లో ఇక్కడకు ఎక్కువగా విద్యార్థులు వస్తుంటారు. రాజాంలో ఉన్నవారే కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉంటున్న చిన్నారులు సెలవులు కారణంగా రాజాం రావడంతో వారంతా ఈ శిక్షణలో పాల్గొని పలు కళారంగాల్లో తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు.

బాలల ప్రతిభకు వేదిక బాలభవన్

బాలల ప్రతిభకు వేదిక బాలభవన్

బాలల ప్రతిభకు వేదిక బాలభవన్