
నేడు నీట్ ప్రవేశ పరీక్ష
● 1,550 మంది కోసం 5 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
విజయనగరం అర్బన్: మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్–2025 పరీక్ష జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ఆదివారం జరగనుంది. పట్టణంలోని జేఎన్‌టీయూ జీవీ యూనివర్సిటీలో రెండు, ప్రభు త్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు, కేంద్రీయ విద్యాలయంలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో 1,550 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
11వ తేదీ వరకు కలెక్టర్ సెలవు
● ఇన్‌చార్జి కలెక్టర్‌గా జేసీ సేతు మాధవన్
విజయనగరం అర్బన్: కలెక్టర్ డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఆదివారం నుంచి 11వ తేదీ వరకు వ్యక్తిగత సెలవుపై వెళ్లనున్నారు. ఆయన తిరిగి ఈ నెల 12వ తేదీన జిల్లాకు రానున్నారు. ఈ కాలంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని కలెక్టర్ కార్యాలయ వర్గాలు శనివారం ఓ ప్రకటనలో తెలిపాయి.
5న ఎస్టీ కమిషన్ చైర్మన్ గిరిజన వర్సిటీ సందర్శన
విజయనగరం అర్బన్: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు ఈ నెల 5న జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి జెడ్పీ అతిథిగృహానికి చేరుకుంటారు. అక్కడ సందర్శకులను కలిసిన అనంతరం 10.15 గంటలకు బయలుదేరి కొండకరకాం పరిధిలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి వెళ్తారు. అక్కడి పరిపాలనా సిబ్బందితో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. అనంతరం 11 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మెంటాడ మండలం కుంటినవలస వద్ద నిర్మాణంలో ఉన్న గిరిజన వర్సిటీ పనులను పరిశీలిస్తారు. అధికారులు, సిబ్బందితో చర్చించిన అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి విజయనగరం జెడ్పీ అతిథి గృహానికి చేరుకుంటారు.
నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ పార్క్
● రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌ల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, అర్బన్ ప్రాంతాలను ఎంపిక చేసి నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు కృషిచేస్తున్నట్టు రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌ల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో శనివారం మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాజధాని నిర్మాణాలను పునఃప్రారంభించినట్టు వెల్లడించారు. 58 వేల కోట్ల రూపాయలతో కూడిన విజన్ ప్రణాళికను ప్రధాని మోదీ ఆవిష్కరించడం శుభపరిణామం అన్నారు.

నేడు నీట్ ప్రవేశ పరీక్ష