పన్ను వసూలులో నిర్లక్ష్యం..! | - | Sakshi
Sakshi News home page

పన్ను వసూలులో నిర్లక్ష్యం..!

Apr 15 2025 1:45 AM | Updated on Apr 15 2025 1:45 AM

పన్ను

పన్ను వసూలులో నిర్లక్ష్యం..!

పంచాయతీల్లో పడకేసిన ప్రగతి

వసూలులో వెనుకబడిన అధికారులు

బకాయి రూ.కోట్లలోనే..

రామభద్రపురం: పంచాయతీల్లో ఇంటి పన్ను, ఆస్తిపన్ను వసూలు విషయంలో అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది.ఫలితంగా ఆయా పంచాయతీలు ఆర్థిక సంక్షోహం ఎదుర్కొంటుండడంతో పల్లెల్లో ప్రగతి పూర్తిగా పడకేసింది. గ్రామాల్లోని గృహాలు, ఖాళీస్థలాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ద్వారా మార్చి 31 నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేస్తామని అధికారులు ప్రకటించినా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు.

ఇంటి పన్నుల వసూలు ఇలా..

జిల్లాలో 777 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో మార్చి 31 నాటికి 2023–24 ఏడాదికి సంబంధించి ఇంటి పన్నులు పాతబకాయి రూ.3,31,52,718 కాగా, 2024–25 ఏడాదికి వసూలు చేయాల్సింది. రూ. 15,76,14,332. మొత్తంగా రూ. 19,07,67,050 లు వసూలు లక్ష్యం ఉంది. అయితే ఇందులో పాత బకాయి రూ.2,66,11,654లు, ఈ ఏడాది రూ.13,40,20,752లు వసూలు చేశారు.మొత్తంగా రూ.16,06,32,406 వసూలైంది. ఇంకా పాత బకాయిలు రూ.65,41,064లు, 2024–25 ఏడాది వసూలు చేయాల్సింది రూ.2,35,93,584 బకాయి ఉంది. మొత్తంగా రూ.3,01,34,644లు బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

పడకేసిన ప్రగతి..

పంచాయతీ ఖజానాలో పైసా లేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిధులు లేక వాటిలో ప్రగతి పనులు పడకేశాయి. తాగునీటి పథకాల నిర్వహణతో పాటు వీధిదీపాలు, పారిశుద్ధ్యం నిర్వహణకు సొమ్ములేదు. దీంతో గ్రామకార్యదర్శులు, సర్పంచులు గ్రామాల్లో పనులు చేయించుకోలేకపోతున్నారు. వీధుల్లో రోడ్లు, మురుగుకాలువల నిర్మాణాలకు నిధులు లేవు.నీటి పథకాలను అతికష్టం మీద నిర్వహిస్తున్నారు. మోటార్లు కాలిపోతే రూ.వేలల్లో ఖర్చువుతుంది. ఆ సొమ్మును సర్పంచులే భరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తే వాటిలో బిల్లు చేసుకోవాలన్న ఆశతో సొంత సొమ్మును ఖర్చు పెడుతున్నారు. మారుమూల గ్రామాల్లో వీధి దీపాలు కూడా వెలగడం లేదని, పండగలకు మాత్రమే వీధి దీపాలు వెలుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.

కాళ్లరిగేలా తిరిగినా సీసీ రోడ్డు వేయరు

ప్రతి నాయుకుడి దగ్గరికి కాళ్లరిగేలా తిరిగినా మా వీధిలో సీసీ రోడ్డు వేయడం లేదు. ఏళ్లుగా బుగ్గి, బురదలోనే తిరుగుతున్నాం. ఎన్నికల సమయంలో వచ్చిన పెద్ద నాయకుల దృష్టిలో కూడా పెట్టాం. అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పడమే కానీ చేయడం లేదు. ఇకనైనా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

– బోయిన బాలరాజు, నేరళ్లవలస, జన్నివలస

పన్నులు వదిలే ప్రసక్తి లేదు..

గ్రామాల్లో ప్రజల నుంచి ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు రాబడతాం. వదిలే ప్రసక్తి లేదు.త్వరలో వెబ్‌సైట్‌ అందుబాటులోకి వస్తుంది. పన్ను వసూళ్లపై ప్రచార మాధ్యమాల ద్వారా, అలాగే సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపించి పక్కా ప్రణాళికతో వసూలు చేస్తాం. ఆస్తి పన్ను చెల్లింపులో ఇప్పుడు 50 శాతం రాయితీ వర్తిస్తుంది. పన్నులు వసూలైతేనే ప్రగతి పనులకు నిధుల కొరత లేకుండా ఉంటుంది.

– వెంకటరమణ, ఈవోపీఆర్డీ, రామభద్రపురం

ఆస్తి పన్ను వసూలు ఇలా..

అలాగే పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరులైన మార్కెట్‌ వేలం, చేపల చెరువులు, దుకాణాలు, చేపల చెరువుల లీజులు, సంతలు, సెల్‌టవర్స్‌ తదితర ఆస్తి పన్నులు 2023–24 ఏడాది పాత బకాయిలు రూ.1,65,42,853లు, 2024–25 ఏడాది వసూలు చేయాల్సింది రూ.3,25,95,344 ఉండగా, మొత్తంగా 4,91,38,197 వసూలు లక్ష్యం ఉంది. ఇందులో పాతబకాయి రూ.95,09,074లు, ఈ ఏడాది రూ.2,57,44,030లు వసూలు చేశారు.మొత్తంగా రూ.3,52,53,104 వసూలైంది.ఇంకా పాత బకాయిలు రూ.70,33,779లు, ఈ ఏడాది వసూలు చేయాల్సింది రూ.68,51,314 బకాయి ఉంది. మొత్తంగా రూ.1,38,85,093లు బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.అయితే మార్చి 31 అర్ధరాత్రి నుంచి ఆస్తిపన్నుకు సంబంధించి ప్రభుత్వ వెబ్‌సైట్‌ నిలిపివేసినట్లు తెలిసింది.ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం వివరాలు అప్‌డేట్‌ అయిన తర్వాత వెబ్‌సైట్‌ మళ్లీ అందుబాటులోకి రానుందని సమాచారం.

పన్ను వసూలులో నిర్లక్ష్యం..!1
1/3

పన్ను వసూలులో నిర్లక్ష్యం..!

పన్ను వసూలులో నిర్లక్ష్యం..!2
2/3

పన్ను వసూలులో నిర్లక్ష్యం..!

పన్ను వసూలులో నిర్లక్ష్యం..!3
3/3

పన్ను వసూలులో నిర్లక్ష్యం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement