
ఎస్సీ యువత ఉపాధికి ప్రత్యేక ప్రణాళిక
విజయనగరం టౌన్:
జిల్లాలో షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ శుక్రవారం తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.21.13 కోట్ల ఖర్చుతో 509 యూనిట్ల ఏర్పాటుకు షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ రూపొందించిన ప్రణాళిక అమలుకు అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న శ్రీకారం చుడతామన్నారు. బ్యాంకుల నుంచి రూ.1174.76 లక్షలను రుణాల రూపంలో అందజేస్తామన్నారు. రూ.832.64 లక్షల సబ్సిడీ వర్తింపజేస్తామని చెప్పారు. షెడ్యూల్ కులాల యువతకు ఉపాధి కల్పన కోసం 32 రకాల స్వయం ఉపాధి పథకాల నుంచి ఆర్థిక సహకారం అందజేస్తామన్నారు. ఒక్కో లబ్ధిదారు రూ.2.50 లక్షల నుంచి రూ.20 లక్షల విలువగల యూనిట్లు ఏర్పాటుచేసుకోవచ్చన్నారు. దీనికోసం మే 10వ తేదీలోగా ఎస్సీ కార్పొరేషన్‌కు ఏపీఓబీఎమ్‌ఎమ్‌ఎస్ డాట్ ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
506 యూనిట్ల ఏర్పాటు లక్ష్యం
కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్
ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ కింద రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ గల 152 యూనిట్లు కేటాయిస్తారు. వీటిలో సబ్సిడీ 50 శాతం, బ్యాంకు రుణం 45 శాతం ఉంటుంది. లబ్ధిదారుని వాటా 5 శాతం చెల్లించాలి. ప్యాసింజర్ ఆటో, కారు, గూడ్స్, ట్రక్ వంటి వాహనాల కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్‌లో డ్రోన్‌ల కొనుగోలు కోసం ఐదుగురితో కూడిన గ్రూప్‌లకు రుణాలు మంజూరుచేస్తారు. రూ 40 లక్షల వ్యయం కాగల ఒక్కో యూనిట్‌ను ఐదు గ్రూపులకు మంజూరు ఉంటుంది. ఇందులో రూ.32 లక్షలు సబ్సిడీగా లభిస్తుంది. బ్యాంకు నుంచి రూ.6 లక్షలు రుణంగా మంజూరవుతుంది. మిగిలిన రూ.2 లక్షల మొత్తం లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి.