
నేటి నుంచి పది పరీక్షలు
విజయనగరం అర్బన్:
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవా రం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణ లో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని పది పరీక్షల జిల్లా పరిశీలకురాలు తెహరా సుల్తాన్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆమె స్థానిక డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు తెలిపారు. ఈ ఏడాది కూడా పది పరీక్షల్లో పలు నూతన విధానాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రంలోని ఒకే గదిలో విధులు నిర్వర్తించకుండా ఉండేలా ఏ రోజుకారోజు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ‘లాటరీ పద్ధతి’ ద్వారా వారికి విధులు కేటాయిస్తామన్నారు. పరీక్ష రోజు సంబంధిత పరీక్ష సబ్జెక్టు టీచర్ ఇన్విజిలేటర్ విధులు నిర్వర్తించకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలలో నాలుగు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పా టు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరీక్ష రాస్తున్న 22,930 మంది కోసం జిల్లా వ్యాప్తంగా 119, ఓపెన్ స్కూల్ 614 మంది విద్యార్థులకు 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు రెగ్యులర్ పది పరీక్ష ఉంటుంది. అదే ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. 238 మంది పరీక్షల పర్యవేక్షకులు/డిపార్ట్‌మెంట్ అధికారులు, 1,150 మంది ఇన్విజిలేటర్లు, 36 మంది కస్టోడియన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 9 మంది, 9 రూట్లలో స్టోరేజ్ సాయింట్లు 29 ఏర్పాటు చేశారు.
విద్యార్థులూ.. తస్మాత్..
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ వాటర్, ఇతర శక్తినిచ్చే పానీయా లు తన వెంట పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లొ చ్చు. పెన్ను, పెన్సిల్, హాల్‌టికెట్, తదితర పరీక్ష సామగ్రిని మాత్రమే వెంట తీసుకెళ్లాలి. పరీక్ష సమయానికి అర గంట ముందే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలి. ఓఎంఆర్ షీట్‌లో విద్యార్థి వివరాలను పూర్తి చేసే సమయంలోనూ జాగ్రత్తలు వహించాలి.
పరీక్ష కేంద్రాలను సందర్శించిన జిల్లా పరిశీలకురాలు
పట్టణంలోని వివిధ పరీక్ష కేంద్రాలను జిల్లా పరిశీలకురాలు తెహరా సుల్తాన్ ఆదివారం సందర్శించారు. కంటోన్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో గదులలోని ఫ్యాన్‌లు, తాగునీరు, సౌకర్యాలను పరిశీలించారు. ఆమెతో పాటు డీఈఓ యు.మాణిక్యంనాయుడు, పార్వతీపురం మన్యం డీఈఓ డాక్టర్ ఎన్.తిరుపతినాయుడు, పరీక్షల విభాగం ఏసీ టి.సన్యాసిరాజు ఉన్నారు.
22,930 మంది విద్యార్థులకు 119 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల విధులు
పది పరీక్షల జిల్లా పరిశీలకురాలు తెహరా సుల్తాన్

నేటి నుంచి పది పరీక్షలు