
సమగ్ర వివరాలు లేని ప్రణాళికలు ఆచరణ శూన్యం
విజయనగరం అర్బన్: గ్రామస్థాయిలో వనరులు, అభివృద్ధి అవకాశాల అంచనా వివరాలు లేకుండా.. శాఖాపరమైన మదింపు చేయకుండా అభివృద్ది విజన్ ప్రణాళిక ఆచరణ సాధ్యం కాదని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ అహ్మద్‌బాబు తేల్చిచెప్పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీ–4, స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళికలో భాగంగా నియోజకవర్గం అభివృద్ధికి విజన్ ప్లాన్ తయారీపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎ.బాబు పాల్గొన్నారు. నియోజకవర్గం ప్రణాళిక తయారీలో గజపతినగరం నియోజకవర్గంపై తయారు చేసిన మోడల్ ప్రణాళికను ముఖ్య ప్రణాళిక అధికారి పి.బాలజీ వివరించారు. నియోజకవర్గం భౌగోళిక స్వరూపం, వనరుల లభ్యత, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అంశాలు, పంటలు, నీటి వనరులు, భౌతిక, సాంస్కృతిక, పర్యాటక అంశాలు, బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లను వివరిస్తుండగా అసలు ఇవన్నీ గ్రామస్థాయిలో సేకరించినవేనా అంటూ బాబు సందేహం వ్యక్తంచేశారు. గ్రామస్థాయిలో రూపొందించని అభివృద్ధి ప్రణాళికలతో లాభం ఉండదన్నారు. రానున్న ఐదేళ్లకు ప్రతి శాఖ వాస్తవ, ఆచరణాత్మకమైన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. జిల్లాకు చెందిన ప్రొగ్రాం, ప్రాజెక్టులు కూలంకుషంగా ప్రణాళికలో కనపడాలన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో మామిడి వంటి వాణిజ్య పంటలకు డిమాండ్ ఉంటుందన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి పంటకు ఒక సమగ్ర ప్రణాళిక ఉండాలన్నారు. అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరల్చాలని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో ఒక బిజినెస్ సెంటర్ ఏర్పాటుకు రెండు ఎకరాల భూమిని గుర్తించాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ తాటిపూడి వద్ద బోటు విహార యాత్ర ద్వారా 2 నెలల్లో రూ.35 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి ప్రణాళిక తయారీ కోసం నిర్వహించే చర్చకు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికార యంత్రాంగం విలువైన సమయం వృథా అయ్యిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. సమావేశంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ దాట్ల కీర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పీ–4, స్వర్ణాంధ్ర విజన్–2047పై చర్చలో
జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్‌బాబు

సమగ్ర వివరాలు లేని ప్రణాళికలు ఆచరణ శూన్యం