
బొండపల్లిలో ఒకేషనల్ జవాబు పత్రాల మూల్యాంకనం
సీతంపేట: ఉత్తరాంధ్రంలోని ఇంటర్మీడియట్ వృత్తివిద్యా కోర్సు విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం బొండపల్లిలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 17 నుంచి మూల్యాంకనం జరగనుంది. గతంలో విశాఖపట్నం జైలు రోడ్డులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించేవారు. జనరల్ సబ్జెక్టుల మూల్యాంకనం యథావిధిగా పార్వతీపురం మన్యం జిల్లాలోని బెలగాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నారు.
నేడు ఎఫ్‌ఆర్‌ఓ ఉద్యోగాలకు రాతపరీక్ష
విజయనగరం అర్బన్: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం నిర్వహించే రాతపరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. అలాగే, ఈ నెల 17న జరగనున్న ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తన చాంబర్‌లో పరీక్ష ఏర్పాట్లపై శనివారం సమీక్షించారు. జిల్లాలోని చింతలవలస వద్ద ఉన్న ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, గాజులరేగలోని అయాన్ డిజిటల్ సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.
ఏప్రిల్ 14న మెరిట్ జాబితా విడుదల
విజయనగరం ఫోర్ట్: వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో 91 పోస్టులకు సంబంధించిన తుది మెరిట్ జాబితాను ఏప్రిల్ 14న ప్రకటిస్తామని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న ప్రకటించిన ప్రొవిజినల్ జాబితాలో అభ్యంతరాలుంటే వారం రోజుల్లో తెలియజేయాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 20వ తేదీన కౌన్సెలింగ్ చేసి నియామకపత్రం అందజేస్తామని పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్ వీరంగం...
లాఠీలకు పనిచెప్పిన ఖాకీలు!
మెరకముడిదాం: ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తు లో వీరంగం సృష్టించగా... పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పిన ఘటన విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుదరాయవలస పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బుధరాయవలస గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సిరిపురపు రాంబాబు కొన్నినెలల కిందట అదే గ్రామానికి చెందిన ఓ మహిళను తీసుకెళ్లిపోయాడు. అప్పటికే రాంబాబుకు భార్య లక్ష్మితో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో సైతం మద్యం సేవించి గొడవపడడంతో ఆమె కొద్దిరోజుల కిందట బుదరాయవలస పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ కోసం పోలీసులు రాంబాబును పిలిచారు. స్టేషన్‌లో విచారణ జరుపుతున్న సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై తిరగబడడం, ఆటోను పోలీసులపైకి ఎక్కించే ప్రయ త్నం చేశాడు. దీంతో పోలీసులు రాంబాబుని చుట్టుముట్టి లాఠీలకు పనిచెప్పారు. ఈ దాడిలో రాంబాబు వీపుపై తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ఆటో డ్రైవర్‌ను కుటుంబ సభ్యులు చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. తనను విచారణకు పిలిచి నలుగురు పోలీసులు నిర్ధాక్షిణ్యంగా కొట్టినట్టు ఆటోడ్రైవర్ పేర్కొన్నాడు. విచారణ సమయంలో సిబ్బందిపై తిరగబడడంతోనే కొట్టాల్సి వచ్చిందని ఎస్‌ఐ జె.లోకేశ్వర రావు తెలిపారు.