
పదోన్నతుల్లోని లోపాలను సవరించాలి
● విద్యాశాఖ ఆర్‌జేడీకి ఎస్టీయూ జిల్లా కమిటీ సభ్యుల వినతి
విజయనగరం అర్బన్: విద్యారంగంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో చేపడుతున్న విధానాల్లో లోపాలను సరిచేయాలని ఎస్టీయూ జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లాకు వచ్చిన ఆర్‌జేడీ కె.విజయభాస్కర్‌ను శుక్రవారం కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. పదోన్నతుల్లో ఎవ్వరికీ అన్యాయం జరగకూడదన్నారు. తరగతులు, మ్యాపింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఎంసీ కమిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసికోవాలని కోరారు. బకాయిపడి ఉన్న 50 శాతం పాఠశాల నిర్వహణ నిధులు చెల్లించాలని, గిరిశిఖర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు స్పెషల్ పాయింట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్, పీఎఫ్, ఏపీఎల్‌ఐ వంటి ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరారు. ఆర్‌జేసీని కలిసిన వారిలో సంఘ జిల్లా అధ్యక్షుడు కె.జోగారావు, జిల్లా ప్రధాన క్యాదర్శి చిప్పాడ సూరిబాబు, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.మురళి, జిల్లా ఉపాధ్యాయులు టి.నాగేశ్వరరావు, ఎస్.బంగారయ్య, పి.రాంబాబు తదితరులు ఉన్నారు.
ఐసీడీఎస్‌లో ఆకలి కేకలు
● వన్‌స్టాప్ సెంటర్, చైల్డ్‌హెల్ప్‌లైన్
విభాగాల సిబ్బందికి అందని జీతాలు
విజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్‌లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఐసీడీఎస్ పరిధిలోని వన్‌స్టాప్ సెంటర్, చైల్డ్ హెల్ప్‌లైన్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఏడు నెలలుగా జీతాలు అందకపోవడంతో పస్తులతో గడుపుతున్నారు. ఇంటి నుంచి కార్యాలయానికి రావడానికి రవాణా చార్జీలకు కూడా అప్పుచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వన్‌స్టాప్ సెంటర్‌లో అడ్మినిస్ట్రేటర్, కౌన్సిలర్, ఐటీ స్టాప్, పారా మెడికల్ వర్కర్ ఒక్కొక్కరు, కేస్ వర్కర్లు ఇద్దరు, హెల్పర్స్ ఇద్దరు, సెక్యూరిటీ గార్డులు ముగ్గురు కలిపి 11 మంది పనిచేస్తున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్‌లో నలుగురు పనిచేస్తున్నారు. వీరిలో సూపర్ వైజర్లు ఇద్దరు, కేస్ వర్కర్లు ఇద్దరు పనిచేస్తున్నారు. వన్‌స్టాప్ సెంటర్ సిబ్బంది 11 మందికి గతేడాది ఆగస్టు నుంచి నెలకు రూ.2.50 లక్షల చొప్పున రూ.17.50 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, చైల్డ్‌హెల్ప్‌లైన్ సిబ్బంది నలుగురికి రూ.5.61 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఐసీడీఎస్ ఇన్‌చార్జి డీపీ జి.ప్రసన్న వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా బడ్జెట్ రాలేదని, వచ్చిన వెంటనే జీతాలు చెల్లిస్తామని చెప్పారు.

పదోన్నతుల్లోని లోపాలను సవరించాలి