
నేడు జిల్లా ప్రత్యేక అధికారి రాక
విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్, రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ అహ్మద్‌బాబు జిల్లాలో శనివారం పర్యటించనున్నట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకొని స్వచ్ఛాంద్ర కార్యక్రమాలను పరిశీలిస్తారు. 10.30 గంటలకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, ఆదాయార్జన శాఖల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంపుదలలో సాధించిన ప్రగతి, తదితర అంశాలపై సమీక్షిస్తారని పేర్కొన్నారు.
నేటితో చెరకు క్రషింగ్ పూర్తి
రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో శనివారంతో చెరకు క్రషింగ్ పూర్తవుతుందని కర్మాగారం యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. స్థానిక విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ ప్రతిరోజు 4వేల పైచిలుకు టన్నుల చెరకు క్రషింగ్ చేశామని, ఇప్పటివరకు 3.50 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ పూర్తయిందన్నారు. రైతులు కర్మాగారానికి చెరకును తరలించిన వారం రోజులకే బిల్లులు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్టు వెల్లడించారు.
రికార్డు సృష్టికర్తకు సన్మానం
బొబ్బిలి: పాత బొబ్బిలికి చెందిన ఎంటెక్ విద్యార్థి 55 సెకెన్లలో హనుమాన్ చాలీసాను పఠించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న వెలగాడ తాతబాబు కుమారుడు జయపవన్ కళ్యాణ్ హనుమాన్ చాలీసాను నిత్య పఠనంగా మార్చుకుని పట్టుసాధించాడు. ఆన్‌లైన్ పోటీలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఇతని ప్రతిభను గుర్తించి బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పించినట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టణానికి చెందిన ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సభ్యుడు పుల్లెల శ్రీనివాసరావు, తదితరులు జయపవన్‌ను దుశ్శాలువతో సత్కరించారు.
రైతు బజార్లను పరిశుభ్రంగా ఉంచాలి
● వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్
ఎం.వి.సునీత
విజయనగరం ఫోర్ట్: రైతు బజార్లను పరిశుభ్రంగా ఉంచాలని వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ ఎం.వి.సునీత అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఉన్న ఆర్‌అండ్‌బీ, ఎం.ఆర్.హెచ్, దాసన్నపేట రైతు బజార్లను ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. రైతుల గుర్తింపు కార్డులపై ఆరా తీశారు. రైతులు తీసుకొస్తున్న టమాటా, డ్వాక్రా దుకాణాల్లో విక్రయిస్తున్న ఉల్లిపాయలను పరిశీలించారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మార్కెటింగ్‌శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ పి.సుధాకర్, డిప్యూటీ డైరెక్టర్ జి.శ్రీనివాస్ కిరణ్, అసిస్టెంట్ డైరెక్టర్ బి.రవికిరణ్, రైతు బజార్ల ఏఓలు చప్ప సతీష్‌కుమార్, ఉమామహేశ్వరరావు, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

నేడు జిల్లా ప్రత్యేక అధికారి రాక

నేడు జిల్లా ప్రత్యేక అధికారి రాక