
మోసపోతున్నా... మౌనమేల?
మోసాలెన్నో...
● తూనికలు, కొలతల్లో ఆదమరిస్తే అంతే సంగతులు
● కొనుగోలుదారులను దోచుకుంటున్న
కొంతమంది వ్యాపారులు
● మోసాలు ఎదురవుతున్నా భరిస్తున్న
కొనుగోలుదారులు
● అవగాహన లేక హక్కులను
వదులుకుంటున్న వైనం
● వినియోగదారుల ఫోరంలో ఏటా
వందకు మించని ఫిర్యాదులు
● తూనికలు, కొలతల శాఖ తనిఖీల్లోనూ వందల సంఖ్యలోనే కేసులు
● నేడు ప్రపంచ వినియోగదారుల
హక్కుల దినోత్సవం
ఉదయాన్నే కొనుగోలుచేసే పాలు, పెరుగు ప్యాకెట్‌లపై తేదీ గమనించి గడువు ముగిసినది
అంటగడితే వెంటనే ప్రశ్నించాలి.
లేదంటే ఆ మోసాన్ని మనం ప్రోత్సహించినట్టే లెక్క.
కళ్లముందే వివిధ రకాల ఆహార పదార్థాల తూకంలో తేడాలుంటే వెంటనే నిలదీయాలి.
మనకెందుకులే అనుకుంటే తప్పుడు కొలతలకు ఊతమిచ్చినట్టే.
ఎమ్మార్పీ ధరలకు మించి సరుకులు, వస్తువులు విక్రయించినా.. నాణ్యత లోపించిన సరుకులు
అంటగట్టినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసి శిక్ష పడేలా చేయాలి. మోసం చేసినది వ్యక్తి అయినా, సంస్థ అయినా సరే..
ఇందులో అలసత్వం వహిస్తే అక్రమాలను
ప్రోత్సహించినట్టే..
చెల్లించిన డబ్బులకు తగిన సేవలు పొందే హక్కును ప్రతీ వినియోగదారుని(కొనుగోలుదారు)కి చట్టం ప్రసాదిస్తోంది. కావాల్సిందలా మోసాలను గుర్తించడం.. ప్రశ్నించడమే. వ్యాపారుల్లో ఏమాత్రం మార్పురాకపోయినా, మోసాలకు చెక్‌పెట్టకపోయినా వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక ఫోరం ఉంది. అందులో ఫిర్యాదు చేస్తే చాలు పైసా ఖర్చులేకుండానే న్యాయం పొందవచ్చు. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కులు దినోత్సవం సందర్భంగా వినియోగదారుల హక్కులు, ఫిర్యాదు చేసుకునే వెసులబాటు, జిల్లాలో నమోదైన కేసులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
ఉదయం మేల్కొన్నది మొదలు ఏదో ఒక సరుకు, ఏదే ఒక వస్తువు కొనుగోలు చేస్తూనే ఉంటాం. అదే సమయంలో ఏమాత్రం ఏమరుపాటు గా ఉన్నా ఝలక్ ఇచ్చే వ్యాపారులూ ఉన్నారు. కల్తీ చేసినవో, నాసిరకమో, ఎమ్మార్పీ కన్నా ఎక్కువగా వసూలు చేయడమో, తక్కువ పరిణామంలో అంటగట్టడమో... ఇలా తూనికలు, కొలతల్లో, నాణ్యతలో మోసం ఎదురవుతూనే ఉంటుంది. ఇలాంటి మోసాలను ఎదుర్కొనేలా అవగాహన కల్పిస్తూ కొనుగోలుదారుల హక్కులను కాపాడేందుకు ఏటా మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కులు దినోత్సవం నిర్వహిస్తున్నారు. అలాగే వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా వినియోగదారుల రక్షణ చట్టం రూపొందించింది. ఇది 1986 డిసెంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పటికీ సరైన అవగా హన లేక వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. తాము మోసపోయామని తెలిసినా ఫిర్యా దులు చేసేవారూ తక్కువ మందే ఉంటున్నారు. ఈ చట్ట ప్రకారం ఏర్పాటైన జిల్లా వినియోగదారుల ఫోరం (కోర్టు)కు ఫిర్యాదులు కూడా ఏటా వందకు మించట్లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని 2019లో ఈ చట్టం, కోర్టుల పరిధిని ప్రభుత్వం విస్తృతం చేసింది. కోర్టుకు మరిన్ని అధికారాలిస్తూ చట్టాన్ని సవరించింది. ఈ ప్రకారం కోటి రూపాయలలోపు విలువ గల వ్యాజ్యాలు జిల్లా వినియోగదారుల కోర్టు పరిధిలోకే వస్తాయి. ఈ కోర్టులో ప్రస్తుతం 80 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.
తూనికలు, కొలతల శాఖ కేసులు పెట్టినా...
తూనికలు, కొలతల్లో మోసాలు, అధిక ధరలకు సరుకుల విక్రయాలను అరికట్టడంలో జిల్లా తూనికలు, కొలతల (లీగల్ మెట్రాలజీ) శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. తరచుగా తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా కొందరు వ్యాపారులు, ఇతర విక్రయ సంస్థల్లో తీరులో మార్పు రావట్లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సీజనల్ వారీగా కేసులు నమోదు చేస్తున్నారు. ఎరువుల దుకాణాలు, రేషన్ దుకాణాలు, మాంసాహార విక్రయశాలలపై దాడులు చేస్తున్నారు. అదేవిధంగా బంగారం దుఖాణాలు, పెట్రోల్ బంక్‌ల్లో తరచుగా తనిఖీలు చేస్తున్నారు. చేపట్టి మోసాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటున్నారు.
మోసాలపై ఫిర్యాదు చేయవచ్చు
విస్తృతంగా అవగాహన సదస్సులు
వినియోగదారుల హక్కులు, చట్టంపై విస్తృతంగా గ్రామస్థాయి నుంచి అవగాహన సదస్సులు నిర్వహించాలి. ప్రజలను చైతన్యం చేయాలి. ఇందుకు వినియోగదారుల మండళ్లు, స్వచ్ఛంద సంస్థలు బాధ్యత తీసుకోవాలి. యువత ముందుకు రావాలి. చట్టం వినియోగదారులకు ఒక ఆయుధం. ఫిర్యాదు చేస్తే కేవలం మూడు నెలల వ్యవధిలోనే పరిష్కరిస్తాం. విచారణ జాప్యం జరుగుతుందనే అపోహ వద్దు. నేరుగా కానీ, న్యాయవాది ద్వారా కానీ బాధితులు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
– బంటుపల్లి శ్రీదేవి, జిల్లా వినియోగదారుల కమిషన్, సీనియర్ మెంబర్, విజయనగరం
ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే కొనుగోలుచేసే పాలు, పాల పదార్థాల వద్దే మోసం మొదలవుతోంది. కలెక్టరేట్ పరిసరాల్లోనే ఉన్న ఓ దుకాణంలో పాలు ప్యాకెట్ల విక్రయాన్ని పరిశీలిస్తే ఎమ్మార్పీ కన్నా రూ.2 ఎక్కువ వసూలు చేస్తున్నారు. గత ఏడాది కాలంలో తూనికలు కొలతలు శాఖ అధికారులు తనిఖీ చేస్తే ఇలాంటివి పలు చోట్ల బయటపడ్డాయి. అలాంటి వ్యాపారులపై 58 కేసులు నమోదయ్యాయి. వారి నుంచి వసూలుచేసిన అపరాధ రుసుమే రూ.1.37 లక్షల వరకూ ఉంది.
చికెన్, మటన్, చేపల దుకాణాల్లోనూ తూకంలో తేడా వస్తోంది. ఆర్‌అండ్‌బీ రైతుబజారు సమీపంలోని ఓ చేపల దుకాణంలో తూకం తేడా చేస్తున్నారు. ఇలాంటి మోసాలు జరగకుండా తూనికలు, కొలతల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. గత ఏడాది కాలంలో ఇలాంటి మోసాలకు పాల్పడిన వ్యాపారులపై 98 కేసులు నమోదయ్యాయి. వారి నుంచి వసూలైన అపరాధ రుసుం రూ.1.38 లక్షల వరకూ ఉంది.
కిరాణా, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో జరుగుతున్న అవకతవకలపై గత ఏడాది కాలంలో 208 కేసులు నమోదయ్యాయి. ఆయా వ్యాపారుల నుంచి రూ.5.55 లక్షల వరకూ తూనికలు, కొలతల శాఖ అపరాధ రుసుం వసూలు చేసింది.
పేదలకు ఇచ్చే సరుకుల్లోనూ తూకం తేడా చేస్తున్నారు. రేషన్ డిపోలు, ఎండీయూ వాహనాలను తనిఖీ చేస్తే గత ఏడాది కాలంలో 20 కేసులు నమోదయ్యాయి. వారికి తూనికలు, కొలతల శాఖ అధికారులు రూ.71 వేల వరకూ జరిమానా విధించారు.
రైతులకు ప్రతి దశలోనూ మోసగాళ్లు ఎదురవుతూనే ఉన్నారు. విత్తనాలు, ఎరువులు ఎమ్మార్పీ కన్నా రూ.50 నుంచి రూ.200 వరకూ డిమాండును బట్టి వ్యాపారులు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు గత ఏడాది కాలంలో పలుచోట్ల వెలుగులోకి వచ్చాయి. తూనికలు, కొలతల శాఖ 44 వరకూ కేసులు నమోదుచేసింది. ఆయా వ్యాపారుల నుంచి రూ.5.45 లక్షల వరకూ జరిమానా వసూలు చేశారు. ఇక ధాన్యం విక్రయాల సమయంలోనూ రైతులు మోసపోతూనే ఉన్నారు. తూకంలో అవకతవకలకు పాల్పడుతున్న రైసు మిల్లులపై గత ఏడాది కాలంలో 33 కేసులు నమోదయ్యాయి. వారి నుంచి వసూలైన అపరాధ రుసుం మాత్రం రూ.1.55 లక్షలు మాత్రమే.
గృహనిర్మాణ సామగ్రి కొనుగోలులోనూ ఆదమరిస్తే మోసపోవడం ఖాయం. ఇనుము తూకం తక్కువగా వేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇలాంటి మోసాలకుపాల్పడుతున్న ఐరన్, స్టీల్ దుకాణాలపై 22 కేసులు నమోదయ్యాయి. వారికి తూనికలు, కొలతల శాఖ విధించిన జరిమానాయే రూ.92 లక్షల వరకూ ఉంది. ఇసుక తూచే వే బ్రిడ్జిల వద్ద కూడా మోసం జరుగుతోంది. గత ఏడాదికాలంలో 50 కేసులు నమోదయ్యాయి. అందుకు బాధ్యుల నుంచి వసూలు చేసిన జరిమానా రూ.2.91 లక్షలు.
పెట్రోల్ బంకుల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. ప్రతి లీటరు వద్ద వంద పాయింట్ల వరకూ పెట్రోల్, డీజిల్ పంపుల్లో కొట్టేస్తున్నారు. ఇది పైకి కనిపించని మోసం. కేవలం తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీ చేస్తేనే బయటపడుతున్నాయి. గత ఏడాది కాలంలో బంకులపై 118 కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో అపరాధ రుసుం చాలా తక్కువగా ఉంది. కేవలం రూ. 2.23 లక్షలు మాత్రమే.
గత ఏడాది కాలంలో బంగారం దుకాణాలపై 12 కేసులు, ఇతర ముఖ్య వ్యాపారసంస్థలపై 80 కేసులు నమోదయ్యాయి.

మోసపోతున్నా... మౌనమేల?

మోసపోతున్నా... మౌనమేల?

మోసపోతున్నా... మౌనమేల?

మోసపోతున్నా... మౌనమేల?