
ఏటీఎం మోసాల ముఠా అరెస్టు
పాలకొండ: ఏటీఎంల వద్ద మాటు వేసి డబ్బులు తీసేందుకు వెళ్లిన వారిని మాటల్లో పెట్టి వారి కార్డులు, డబ్బులు దొంగిలించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీఎస్పీ ఎం రాంబాబు ఇందుకు సంబందించిన వివరాలు శుక్రవారం వెల్ల డించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ముంబైకి చెందిన అయజ్ ద్వివేది, అప్పర్‌ఖాన్‌లు ఈ ఏడాది జనవరిలో పాలకొండలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద థామస్ అనే వ్యక్తిని మోసగించి ఏటీఎం కాజేసి నగదు విత్ డ్రా చేసుకున్నారు. దీనిపై జనవరి 17న పాలకొండ పోలీస్‌స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుగొలిపే విషయాలు వెలుగులోనికి వచ్చాయి. నిందితులిద్దరూ దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద అత్యంత తెలివిగా మోసగించి నగదు కాజేస్తున్న విషయాన్ని గుర్తించారు. టెక్నికల్ సమస్యలు ఉన్న ఏటీఎంల వద్ద మాటు వేసి ఒకరు బయట వేచి ఉంటారు, మరొకరు లైన్‌లో ఉండి డబ్బులు తీయడానికి వచ్చిన వారికి సహాయం చేస్తున్నట్లు నటిస్తాడు. ఆ సమయంలో వారి పిన్ నంబర్‌ను గుర్తిస్తారు. అనంతరం ఏటీఎం నుంచి కార్డు తీసిన సమయంలో వారి వద్ద ఉన్న కార్డుతో నగదు తీసే వారికి అందించి నిందితుల వద్ద ఉన్న అదే రకం కార్డును అందజేస్తారు. ఈ విధంగా కార్డు మార్చిన తరువాత ఆ కార్డులో ఉన్న నగదు మొత్తం డ్రా చేసుకుని ఆ కార్డును మరొకరిని మోసం చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం వీరు నిరక్షరాస్యులు, వృద్ధులను టార్గెట్ చేసి మోసాలు చేస్తున్నారు. ఇటీవల నిందితులు మరోమారు పాలకొండలో నేరాల కోసం రావడంతో వారి కదలికలపై నిఘాపెట్టి పోలీసలుఉ అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి రూ.4లక్షల పదివేలు నగదు, స్విఫ్ట్ కారు, రెండు ఫోన్లు, 78 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రాంబాబు వివరించారు. ఆయనతో పాటు సమావేశంలో సీఐ చంద్రమౌళి, ఎస్సై ప్రయోగ మూర్తి ఉన్నారు.
రూ.4లక్షల నగదు, 78 ఏటీఎం
కార్డులు స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాంబాబు