తెర్లాం: వ్యవసాయ యాంత్రీకరణ ఉపకరణాలు అందించేందుకు జిల్లాకు రూ.2.5కోట్ల రాయితీని ప్రభుత్వం ప్రకటించిందని జిల్లా వ్యవసాయ అధికారి వి.తారక రామారావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన తెర్లాం వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం 50శాతం రాయితీపై పవర్‌స్ప్రేయర్లు, పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు, ట్రాక్టరు పరికరాలు రైతులకు అందించనుందని చెప్పారు. రస్రేయర్లకు మాత్రం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. వీటన్నింటికి కలిపి జిల్లాకు రూ.2.5కోట్లు ప్రభుత్వం రాయితీ ప్రకటించిందని తెలిపారు. జిల్లాలోని రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు పొందేందుకు ఆయా మండలాల వ్యవసాయ అధికారుల ద్వారా దరఖాస్తులు పంపించాలన్నారు. అర్హులైన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. జిల్లాకు మంజూరైన వ్యవసాయ పరికరాలను మండలాల వారీగా కేటాయింపులు చేశామని తెలిపారు. జిల్లాలోని రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గంగన్నపాడు రైతు సేవా కేంద్రం తనిఖీ
మండలంలోని గంగన్నపాడు గ్రామంలో గల రైతు సేవా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు సేవా కేంద్రం ద్వారా జరుగుతున్న రైతు విశిష్ట సేవా సంఖ్య నమోదును పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జిరాయితీ భూములు ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా రైతు విశిష్ట సేవా సంఖ్యను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఆయనతో పాటు మండల వ్యవసాయ అధికారి జి.సునీల్‌కుమార్ ఉన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి వి.తారక రామారావు