విజయనగరం క్రైమ్: ఆత్మహత్యకు పాల్పడతానని సూసైడ్ నోట్ రాసిన కేరళ యువకుడు విష్ణు కొయిత్తా పత్తాయా వెస్లీ (21) ఆచూకీని విజయనగరం టౌన్ పోలీసులు కనిపెట్టి డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు సమక్షంలో యువకుడిని బంధువులకు అప్పగించారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాకు చెందిన విష్ణు కొయిత్తా పత్తాయా వెట్లీ బీఎస్సీ నర్సింగ్ చదివి బెంగళూరులోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో వర్క్ చేస్తున్నాడు. ఒక యువతితో పరిచయం ఏర్పడి, ప్రేమకు దారితీసింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో, యువకుడి ఫోన్ నంబర్‌ను సదరు యువతి బ్లాక్ చేసింది. దీంతో మనస్తాపం చెందిన యువకుడు విష్ణు అమ్మాయి ప్రేమను వదులుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో ట్రేస్ చేసుకోవాలని సూసైడ్ లెటర్ రాసి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టుతో అప్రమత్తమైన విష్ణు బంధువులు, స్నేహితులు సదరు విషయాన్ని నేరుగా విజయనగరం ఎస్పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువకుడి ఆచూకీ కనిపెట్టి, రక్షించే చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించిన మేరకు రంగంలోకి దిగిన వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ తన బృందంతో టెక్నాలజీని వినియోగించి విశాఖపట్నం, చీపురుపల్లి, విజయనగరంలలో పలు ప్రాంతాల్లో గాలించి, చివరికి యువకుడి ఆచూకీని విజయనగరం రైల్వేస్టేషన్‌లో మార్చి 11న రాత్రి కనుగొన్నారు. వెంటనే ఆ యువకుడిని విజయనగరం వన్‌టౌన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించి బంధువులకు సమాచారం ఇచ్చారు. విష్టు బంధువులు గురువారం రాగానే విజయనగరం డీఎస్పీ ఆఫీస్ లో డీఎస్పీ శ్రీనివాస్ సమక్షంలో అప్పగించారు. సకాలంలో స్పందించి, యువకుడి ఆచూకీ కనిపెట్టి, ఆత్మహత్య ఆలోచనల నుంచి కాపాడిన వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, సిబ్బందిని డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్‌ను ఎస్పీ వకుల్ అభినందించారు. యువకుడ్ని కాపాడడంలో చొరవ చూపి, సమయానుకూలంగా అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ వకుల్ జిందల్‌కు యువకుడి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆత్మహత్యకు పాల్పడతానని సూసైడ్ లెటర్ రాసిన యువకుడు