విజయనగరం అర్బన్: డ్రోన్ల వినియోగంతో వ్యవసాయం రంగాన్ని లాభసాటిగా మెరుగుపరచవచ్చని సెంచూరియన్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ జె.అనిల్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. సెంచూరియన్ యూనివర్సిటీతో సంయుక్త నిర్వహణలో స్థానిక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ‘వింగ్స్ ఆఫ్ ఇన్నోవేషన్: ఎంపవరింగ్ స్కిల్స్ త్రూ డ్రోన్ టెక్నాలజీ’ అనే అంశంపై రెండురోజుల పాటు నిర్వహించే వర్క్‌షాప్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయరంగంలో డ్రోన్లను ఉపయోగించి వ్యవసాయం చేయగలిగితే తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల సాయంతో నీటి వనరుల లభ్యత, పురుగు మందుల పిచికారీ, ఎరువులు వేయడం తదితర పనులు తక్కువ ఖర్చుతో చేయడానికి అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలకు డ్రోన్లను రాయితీలపై అందజేస్తోందని తెలిపారు. పర్లాకిమిడి సెంచూరియన్ యూనివర్సిటీ నుంచి గౌరవ అతిథిగా వచ్చిన అసోసియేట్ డీన్ డాక్టర్ కొర్ల హర్షవర్ధన్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో డ్రోన్స్ వినియోగంపై వివరించారు. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రొఫెసర్ శరత్ చంద్రబాబు మాట్లాడుతూ రక్షణ, వ్యవసాయం, ఇతర రంగాల్లో డ్రోన్ల అవసరం పెరిగిందన్నారు. కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్సిటీ అధ్యాపకుడు డాక్టర్ సోనియా పాణిగ్రాహి, వర్క్‌షాప్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.లత, డాక్టర్ ప్రేమ ఛటర్జీ, డాక్టర్ ఎన్‌వీఎస్‌సూర్యనారాయణ, డాక్టర్ ఎంజీనాయుడు, డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, డాక్టర్ కె.దివ్య, డాక్టర్ ఎం.ప్రసాద్, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.