
ఘనంగా వైభవ్ జ్యూయలర్స్ ప్రారంభం
సాలూరు: పట్టణంలో వైభవ్ జ్యూయలరీ షోరూమ్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ మాధవరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్‌లు హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సాలూరు పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ జ్యూయలర్స్ షోరూమ్‌ను అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమన్నారు. సంస్థ అసిస్టెంట్ వైస్‌ప్రెసిడెంట్ రఘునాఽథ్ మాట్లాడుతూ వినియోగదారులకు అద్భుత శ్రేణి షాపింగ్ అనుభవంతో పాటు విస్తృత శ్రేణిలో 916 హాల్‌మార్క్‌డ్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ డైమండ్స్ తదితర ఆభరణాలు అందించాలనే ఉద్దేశంతో ఈ షోరూమ్‌ను సాలూరులో ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో వైభవ్ సంస్థల సీఎండీ గ్రంధి భారత మల్లికా రత్నకుమారి, సీఈఓ గొంట్ల రాఖాల్ తదితరులు పాల్గొన్నారు.
డీసీహెచ్‌ఎస్‌లో ఖాళీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం ఫోర్ట్: జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి (డీసీహెచ్‌ఎస్) పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జీవీ రాజ్యలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తులను 21వతేదీ సాయంత్రం 5 గంటల లోగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు విజయనగరం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని కోరారు.
యువకుడిపై పోక్సో కేసు నమోదు
పార్వతీపురం రూరల్: అమ్మాయిని మోసం చేసిన కేసులో పార్వతీపురం మండలం జమదాల గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి బుధవారం తెలిపా రు. అదే గ్రామానికి చెందిన బాధితురాలు పో లీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉగాది పురస్కారాలకు
దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం టౌన్: శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ఉగాది 2025 పండగ పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మారుమూల పల్లెలు, పట్టణాల్లో మట్టిలో మాణిక్యాల్లా దాగి ఉన్న కవులు, కళాకారుల, రచయితలు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, మేధావులు, వైద్యులు, సమాజ సేవకులు, ఆధ్యాత్మిక, యోగా గురువులు, కార్మికులు, కర్షకులు, క్రీడాకారుల ప్రతిభ ను సేవలను గుర్తించి వారికి ‘శ్రీ విశ్వావసు నా మ సంవత్సర ఉగాది– 2025 పురస్కారాన్ని‘ ఇచ్చి ఘనంగా సన్మానించి సత్కరించనున్నట్లు ‘ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ‘ (సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ డైరెక్టర్ ఈఎస్ ఎస్ నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజసేవ, పర్యావరణ పరిరక్షణ, వృద్ధులు, దివ్యాంగులు, విద్య, వైద్యం, సాహిత్యం, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, కరాటే, ఆధ్యాత్మికం, వ్యవసాయం, ఉపాధి కల్పన, నాటకరంగం, టీవీ సినీరంగాల్లో సేవలందిస్తున్న వారు, ప్రతిభావంతులు, పురస్కారాల ఎంపిక కోసం వారి సేవలను, ప్రతిభను, గురించి తెలియచేసే వివరాలు పంపించాలని కోరారు. వివరాలకు ఫోన్ 9652347207నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఆటో నుంచి జారిపడి ఆరోగ్యమిత్ర మృతి
బొబ్బిలి రూరల్: మండలంలోని పక్కి గ్రామానికి చెందిన సీర గౌరినాయుడు(58) ప్రమాదవశాత్తు ఆటో నుంచి జారిపడి మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొబ్బిలి సీహెచ్‌సీలో ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్న గౌరినాయుడు మంగళవారం విధులు ముగించుకుని స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా పక్కి గ్రామసమీపంలో ఆటోలోంచి జారి పడడంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు సీహెచ్‌సీకి తరలించగా ప్రాథమిక చికిత్సను అందించిన అనంతరం మెరుగైన చికిత్సకోసం విశాఖలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య సరస్వతితో పాటు 10ఏళ్ల బాలుడు,4ఏళ్ల పాప ఉన్నారు. సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఘనంగా వైభవ్ జ్యూయలర్స్ ప్రారంభం