మద్యం షాపుల లాటరీ ప్రక్రియ నిర్వహిస్తున్న అధికారులు
టీడీపీ నేతల కన్నుసన్నల్లో మద్యం సిండికేట్
అత్యధిక షాపులను గుప్పిటపట్టిన వైనం
లాటరీలో చేజారిన షాపులపైనా అదుపాజ్ఞలు
జిల్లాలో 153 మద్యం షాపుల కేటాయింపు
కలెక్టరేట్ వేదికగా లాటరీ ప్రక్రియ పూర్తి
జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్న ఉన్నతాధికారుల మాటలు టీడీపీ కూటమి నాయకుల ముందు చెల్లట్లేదు. ఇలా చెప్పడానికి కొండపల్లి కొండలరావే ఉదంతమే చక్కని ఉదాహరణ. ఆయన ఒక్కరే కాదు జిల్లాలోని టీడీపీ నాయకులు, వారి బినామీలే అత్యధిక సంఖ్యలో మద్యం షాపులను దక్కించుకున్నారు. గత టీడీపీ పాలనలో మాదిరిగానే జిల్లా అంతటా సిండికేట్ చేయాలనే లక్ష్యంతో తొలి నుంచి పావులు కదిపారు. ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగే ప్రదేశాల్లో షాప్‌లు పెట్టి లాభాలు దండుకోవాలనే వ్యూహంతో పనిచేస్తున్నారు. తమకు కావాల్సిన మండలంలో ఎక్కువ దరఖాస్తులు చేయించారు. వాస్తవానికి జిల్లాలో నోటిఫై చేసిన 153 మద్యం దుకాణాలకు 5,237 దరఖాస్తులు దాఖలయ్యాయి. అంటే ఒక్కో దుకాణానికి సగటున 35 మంది పోటీపడ్డారు. కలెక్టరేట్‌లో సోమవారం లాటరీ ప్రక్రియ నిర్వహించారు. చిత్రమేమిటంటే చివరకు ఎక్కువ దుకాణాలు టీడీపీ నాయకులు, వారి బినామీల చేతుల్లోకే వెళ్లిపోయాయి. తమ సిండికేట్ గాకుండా లాటరీలో షాపులు దక్కించుకున్న మిగతావారినీ తమ దారికి తెచ్చుకునేందుకు సామదానభేదదండోపాయాలు మొదలెట్టారు. ఇదిలా ఉండగా, మద్యం దుకాణాల కోసం మహిళలు పోటీపడడం చూసేవారికి ఆశ్చర్యం కలిగించింది.
ఆయన కొండపల్లి కొండలరావు. మండల స్థాయి టీడీపీ నాయకుడు. ఆయన కొడుకు గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్. ఏమి మంత్రం పనిచేసిందో కానీ తన కొడుకుకే రాష్ట్ర మంత్రివర్గంలో చోటుదక్కింది. ఇక ఆ తండ్రి రాజకీయ క్రీడకు అదుపే లేదు. ఇటీవలే అధికారుల బదిలీల్లో చక్రం తిప్పిన ఆయనే ఇప్పుడు మద్యం వ్యాపారంలోనూ తనదైన శైలిలో వేలుపెడుతున్నారనే విమర్శలు గుప్పుమని పొంగుతున్నాయి. సిండికేట్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన లాటరీ ప్రక్రియలో సిండికేట్ గాకుండా బయటవారూ కొంతమంది మద్యం షాపులు దక్కించుకున్నారు. వెంటనే వారందరికీ కబురు వెళ్లింది. మంగళవారం ఉదయమే విజయనగరంలోని మంత్రి ఇంటికి వచ్చేయాలని! అందర్నీ కూర్చోబెట్టి ఎవరు ఏ ప్రాంతంలో షాపు తెరవాలో మళ్లీ లాటరీ తీస్తారట! వాస్తవానికి అలా కేటాయించే అధికారం ఎకై ్సజ్ శాఖ అధికారులది మాత్రమే. కానీ షాడో మంత్రి కొండలరావు ముందు అవన్నీ పనిచేయవు మరి!
సిండికేట్‌లకే మద్యం దుకాణాలు: డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్
విజయనగరం ఫోర్ట్: మద్యం షాపుల టెండర్లలో పారదర్శకత లోపించిందని, సిండికేట్‌లకే దుకాణాలు కేటాయించారని డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ ఆరోపించారు. రాష్ట్రంలో 213 మద్యం షాపులకు తక్కువ దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకుడు జేసీ దివాకరరెడ్డి ఇసుక, పేకాట, క్లబ్బులు, మద్యం సిండికేట్ల నుంచి 15 శాతం కమీషన్ ఇవ్వాలని బహిరంగంగా అడగడం అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. తక్కువ టెండర్ దరఖాస్తులు వచ్చిన 213 మద్యం షాపులకు తిరిగి టెండర్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు సరగడం రమేష్‌కుమార్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అన్నీ టీడీపీ వారికే...
విజయనగరం కార్పొరేషన్ పరిధిలో అవనాపు విజయ్ తదితర టీడీపీ నాయకులు నేరుగా పోటీలోకి దిగారు. వారి సిండికేట్‌కు ఎక్కువ మద్యం షాప్‌లు దక్కాయి. విజయనగరం రూరల్ మండలంలోని ద్వారపూడి, జొన్నవలస, బియ్యాలపేట గ్రామాల్లో మూడు మద్యం షాపులూ టీడీపీకి చెందినవారికే వచ్చాయి.
బొండపల్లి మండలంలోని నాలుగు మద్యం షాపులనూ దక్కించుకోవడానికి టీడీపీ నాయకులే సిండికేట్‌గా ఏర్పడి సఫలమయ్యారు. గంట్యాడ మండలంలో ఆరు షాపులకు గాను మూడే టీడీపీ వారికే దక్కాయి. దత్తిరాజేరు మండలంలో టీడీపీకి చెందిన జెడ్పీపీటీసీ మాజీ సభ్యుడు మక్కువ శ్రీధర్‌కు, ఆయన అనుచరులకే ఎక్కువ షాపులు వచ్చాయి. గజపతినగరం మండలంలోని నాలుగు షాపులకు గాను మూడు షాపులూ శ్రీధర్ టీమే దక్కించుకుంది.
పూసపాటిరేగ మండలంలో తొమ్మిది షాపులకు గాను ఆరు మద్యం షాపులు టీడీపీ, జనసేన పార్టీకి చెందిన నాయకులకే వచ్చాయి. భోగాపురం మండలంలో ఏడు మద్యం షాపులూ కూటమి నాయకులవే. నెల్లిమర్ల మండలంలో ఐదు షాపులకు గాను మూడు, డెంకాడ మండలంలో ఐదింటికి 4 షాపులు వారికే వెళ్లాయి.
రామభద్రపురం మండలంలో ఆరు షాపులకుగాను నాలుగు టీడీపీ వారికి దక్కాయి. తెర్లాం మండలంలో నాలుగు షాపులకు మూడు అధికార పార్టీ నాయకుల ఖాతాలోనే పడ్డాయి. వీటన్నింటినీ దక్కించుకోవడంలో టీడీపీ మద్దతుదారుడైన ఆర్‌కే చౌదరి అనే లిక్కర్ సిండికేట్ చక్రం తిప్పారనేది బహిరంగ రహస్యమే.
బాడంగి మండలంలో మూడు షాపులకు రెండు టీడీపీ వారికే దక్కాయి. ఒకటి ఒడిశాకు చెందిన సంయుక్త సాహుకు లాటరీలో వచ్చింది.
ఎస్.కోటలో నాలుగు మద్యం షాపులు టీడీపీకి చెందినవారికి వచ్చాయి. జామి, కొత్తవలస, ఎల్.కోట మండలాల్లోనూ టీడీపీ నాయకులే ఎక్కువ షాపులు దక్కించుకున్నారు.
చీపురుపల్లి, గరివిడి మండలాల్లో మెజార్టీ షాపులను టీడీపీ వారే దక్కించుకున్నారు. మెరకముడిదాం మండలంలో నాలుగు షాపులకు గాను చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్ మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు ధన్నాన రామచంద్రుడి వర్గానికే రెండు దక్కాయి. వారితో సిండికేట్ అయినవారికే మిగతా రెండు షాపులు వచ్చాయి. గుర్ల మండలంలో నాలుగు షాపులకు రెండు బొబ్బిలి ఆర్‌కే చౌదరి సిండికేట్‌కే వెళ్లాయి.
రాజాంలో ఏడింటిలో నాలుగు టీడీపీ నాయకులు, వారి మద్దతుదారులకే దక్కాయి. రేగిడి మండలంలో రెండు, సంతకవిటి మండలంలోని నాలుగింటిలో మూడు షాపులు కూడా వారితో సిండికేట్ అయినవారికే వెళ్లాయి.
లాటరీ ప్రక్రియకు హాజరైన మహిళలు
గ్రూపుగా చర్చించుకుంటున్న దరఖాస్తుదారులు
డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్


