
పార్వతీపురం టౌన్: పాలకొండ సత్యసాయి డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 1న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయికుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిగ్రీ, డిప్లమా, బీఎీస్సీ, ఎంబీఏ అర్హత గల 18 నుంచి 30 ఏళ్ల యువత అర్హులని తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెక్‌తిమ్మన, డెక్కన్ ఫైన్ కెమికల్స్, అరబిందో, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్, హెటిరో డ్రగ్స్, మేధాసర్వో డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, ముత్తూట్ ఫైనాన్స్, పేటీఎం, నవతా, బిఫిల్ తదితర కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు . ఆసక్తి గల యువతీ యువకులు తమ వివరాలను స్కిల్ యూనివర్స్.ఏపీఎస్‌ఎస్‌డీసీ.ఇన్ వెబ్‌సైట్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకొని రిఫరన్స్ నంబరుతో పాటు ఆధార్ కార్డు, విద్యార్హత సంబంధించిన పత్రాలతో హాజరు కావాలని సూచించారు.
26న రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, ఆర్‌ఓబీలకు శంకుస్థాపన
విజయనగరం టౌన్: అమృత్‌భారత్‌లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, ఆర్‌యూబీల నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న ఉదయం 10.45 గంటలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారని రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలోని పార్వతీపురం (రూ.14.76 కోట్లు), బొబ్బిలి (రూ.16కోట్లు), కొత్తవలస (రూ.18.77 కోట్లు), చీపురుపల్లి (రూ. 21 కోట్లు), శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో రూ.23 కోట్లతో చేపట్టనున్న ఆధునికీకరణ పనులను ప్రధాని ప్రారంభిస్తారన్నారు. విజయనగరంలోని వీటీ అగ్రహారం సమీపంలోని మ్యాంగో యార్డ్ ప్రాంతం, చీపురుపల్లి, దూసి వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.