వెలుగుల పండగ దీపావళి | Sakshi
Sakshi News home page

వెలుగుల పండగ దీపావళి

Published Sun, Nov 12 2023 12:28 AM

విజయనగరం ఆర్టీఓ కార్యాలయం సమీపంలో బాణసంచా విక్రయ కేంద్రాలు 
 - Sakshi

విజయనగరంటౌన్‌/పార్వతీపురంటౌన్‌: అజ్ఞాన చీకట్లను పారదోలే చిరుదివ్వెల పండగ దీపావళి. లోగిళ్లన్నీ నవకాంతులతో వెలుగులీనే వేడుక. పండగ రోజున ఉదయాన్నే చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా నూతన వస్త్రాలను ధరించి లక్ష్మీదేవికి పూజలు, నోములు నిర్వహించడం మన సంప్రదాయం. దానిని కొనసాగిస్తూనే రాత్రివేళ ఇల్లంతా దీపాలతో అలంకరించి, శబ్ధరహిత, వాయుకాలుష్యంలేని బాణసంచా కాల్చి... దీపావళిని ఆనందావళిగా జరుపుకోవాలని కాలుష్యనియంత్రణ మండలి, పర్యావరణ పరిరక్షణ సమితులు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది గ్రీన్‌ (హరిత) దీపావళి జరుపుకోవాలని కోరాయి.

షాపింగ్‌ అదరహో...

దీపావళి సందర్భంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. దీంతో ఆయా దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. బాణసంచా విక్రయాలు జోరుగాసాగాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో శనివారం నాటికి దాదాపు రూ.6 కోట్లకు పైగా వ్యాపారం సాగినట్టు అంచనా. గృహోపకరణాల విక్రయాలైతే దాదాపు రూ.3.50 కోట్ల మేర సాగినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

బాణ సంచా దుష్ఫలితాలివి

బాణసంచా తయారీకి అల్యూమినియం, నైట్రేట్‌, సల్ఫర్‌, పొటాషియం, బేరియం నైట్రేట్‌, కార్బన్‌ కాడ్మియం వంటి రసాయన పదార్థాలను వినియోగిస్తారు. వీటిని కాల్చడం వల్ల మనం పీల్చే ప్రాణవాయువు కలుషితమవుతుంది. కంటికి కనిపించని రసాయన కణాలు శరీరంలోకి వెళ్లి ఆరోగ్యానికి హానికలిగిస్తాయి. ఊపిరితిత్తుల, జీర్ణకోశ వ్యాధులు, కంటి చూపు దెబ్బతినడం, జ్ఞాపకశక్తి మందగించడం, చెవుడు, కేన్సర్‌, మానసిక స్థితిని దెబ్బతీసే వ్యాధులు వచ్చే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక దృఢత్వం తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులు, మహిళలపై బాణసంచా ప్రభావం చూపనుంది. గర్భిణులు, కడుపులో ఉన్న శిశువులకు హానికలుగుతుంది. ఆస్తమా, రక్తపోటు, గుండె వ్యాధిగ్రస్తులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.

అగ్నిప్రమాదాలు సంభవిస్తే 101,

102 నంబర్లకు, గాయపడితే 108 కు సమాచారం ఇవ్వాలి

చిన్నపాటి జాగ్రత్తలతో సంతోషాల

హరివిల్లు

టపాసులు కాల్చేటప్పుడు తస్మాత్‌

దీపావళి.. కారాదు విషాదవళి

కొనుగోలుదారులతో కిక్కిరిసిన

బాణసంచా విక్రయ దుకాణాలు

రూ.కోట్లలో సాగిన వ్యాపారం

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

బాణసంచా కాల్చేటప్పుడు కాటన్‌ దుస్తులు, కళ్లజోడు ధరించాలి.

చిన్న పిల్లులు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి.

ఇంటిలోపల, డాబాలపైన, అపార్ట్‌మెంట్లపైన టపాసులు వెలిగించరాదు.

సగం లేదా పూర్తిగా కాలని టపాసులను వదిలేయకుండా నీరు లేదా ఇసుకను పోయాలి.

శరీరానికి, దుస్తులకు దూరంగా ఉంచి టపాసులు కాల్చాలి.

గడ్డి వాములు, గుడిసెలు, పెట్రోల్‌ బంకులకు దూరంగా టపాసులు కాల్చాలి.

చేతితో పేలుడు పదార్ధాలకు నిప్పు అంటించ వద్దు.

శ్వాస, చర్మ, హృదయ సంబంధిత వ్యాధిగ్రస్తులు టపాసులకు దూరంగా ఉండాలి.

బాణసంచాను ఇళ్లల్లో నిల్వ చేయరాదు.

రోడ్లపై నడిచే ప్రజలపైన, బస్సులు, వాహనచోదకులపై బాణసంచా విసరడం నేరం.

జాగ్రత్తలు మరువద్దు..

దీపావళి పండగను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలి. శబ్ధ, కాలుష్య రహిత బాణసంచాకు ప్రాధాన్యమివ్వాలి. బాణ సంచా కాల్చేసమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి.

– ఎం.దీపిక, ఎస్పీ, విజయనగరం

సుఖసంతోషాలు కలగాలి

దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లాలి. సిరి సంపదలు, సౌభాగ్యాలు కలగాలి. అందరి జీవితాలు ఆనందమయం కావాలి.

– ఆర్‌.గీవిందరావు, జేసీ, పార్వతీపురం మన్యం

ఆనందాల పండగ

కులమతాలకు అతీతంగా, చిన్నాపెద్దా తారతమ్యంలేకుండా ప్రజలందరూ ఆనందంగా జరుపుకునే పండగ దీపావళి. కాలుష్యరహితంగా గ్రీన్‌ క్రాకర్స్‌ వినియోగించాలి. బాణసంచా పేల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళి వెలుగులు ప్రజలందరి జీవితాల్లో ప్రసరించాలి.

– నాగలక్ష్మి, కలెక్టర్‌, విజయనగరం

బాధ్యతాయుతంగా ఉండాలి

టపాసులు అమ్మే వారందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అందుబాటులో అగ్నినిరోధక పరికరాల్లో కనీసం ఒకటైనా ఉంచాలి. ఇసుక, నీటిని తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలి. ఇళ్లల్లో టపాసులు కాల్చేటప్పుడు మహిళలు, యువతులు, చిన్నారులు కాటన్‌ దుస్తులు, బిగుతుగా ఉండేవి ధరించాలి. నీటిని అందుబాటులో ఉంచాలి. ఆనందోత్సవాల మధ్య పండగ నిర్వహించుకోవాలి.

– బి.వి.ఎస్‌. రామ్‌ప్రకాష్‌,

అగ్నిమాపకశాఖ అధికారి, విజయనగరం

పూజకు మంచి ముహూర్తం

దీపావళి అమావాస్య నాడు కేదారేశ్వరి నోములు నోయడం ఆనవాయితీ. సౌభాగ్య సంరక్షణను కాంక్షిస్తూ మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆశ్వయుజ అమావాస్య ఆదివారం రోజు పూర్తిగా ఉండడంతో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్రతాలు ఆచరించవచ్చని వేదపండితులు వెల్లడిస్తున్నారు.

1/7

విజయనగరంలో జోరుగా బాణసంచా విక్రయాలు
2/7

విజయనగరంలో జోరుగా బాణసంచా విక్రయాలు

పార్వతీపురంలో ప్రమిదలు కొనుగోలు చేస్తున్న దృశ్యం
3/7

పార్వతీపురంలో ప్రమిదలు కొనుగోలు చేస్తున్న దృశ్యం

4/7

5/7

6/7

7/7

Advertisement
 
Advertisement