
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి పట్టణంలోని బంగారమ్మకాలనీలో శుక్రవారం వేణుగోపాలస్వామి ఆలయ ప్రారంభోత్సవం వైభవంగా సాగింది. వేదపండితుల మంత్రోచ్చరణాలతో వేణుగోపాలస్వామి, గోదాదేవి, భగవద్రామానుజాచార్యుల విగ్రహాలను ప్రతిష్టించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్, ఆలయ ధర్మకర్త బమ్మిడి అప్పలస్వామి, కష్ణమ్మ దంపతులు, ఆలయ కమిటీ సభ్యుల నేతత్వంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు సాగాయి. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజియర్‌స్వామి, రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి దంపతులు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వందలాదిమంది భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో చినజియర్ స్వామి ప్రత్యేక పూజలు జరిపి వేణుగోపాలస్వామి విశిష్టతను భక్తులకు వివరించారు. మంత్రి బొత్స దంపతులకు, భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు.