ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితుల నుంచి బయటపడటానికి మానసికంగా బలపడే నైపుణ్యాలను డా.పూజిత ‘వ్యాక్సినేషన్’తో పోల్చారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం, ఒత్తిడిని ఎదుర్కోవడం, సహాయం కోరడం వంటి లక్షణాలను చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలన్నారు. దీనివల్ల ఎలాంటి కష్టాన్నయినా ఎదుర్కొనే మానసిక స్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కొన్ని సంకేతాలను హెచ్చరికలుగా గుర్తించాలని ఆమె చెప్తున్నారు.
● మరణం గురించి తరచూ మాట్లాడటం, నేను లేకపోతే అందరికీ బాగుంటుంది.. అని ప్రస్తావించడం.
● కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరంగా ఉండటం, ముఖ్యమైన కార్యక్రమాలకు గైర్హాజరు కావడం.
● తీవ్ర నిరాశ, బాధ నుంచి అకస్మాత్తుగా ప్రశాంతంగా మారిపోవడం.
● తనకు ఎంతో ఇష్టమైన వస్తువులను ఇతరులకు దానంగా ఇచ్చేయడం.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై బాధితులకు మానసిక సాంత్వన చేకూర్చాలి. వారికి తోడుగా ఉంటూ, ఒంటరిగా వదలకుండా తగిన భరోసా కల్పిస్తే ఆత్మహత్యల ముప్పును విజయవంతంగా తగ్గించవచ్చు.


