మైనర్‌ ప్రేమ.. ఉసురు తీసుకుంది..! | - | Sakshi
Sakshi News home page

మైనర్‌ ప్రేమ.. ఉసురు తీసుకుంది..!

Sep 18 2026 1:03 AM | Updated on Sep 18 2026 1:03 AM

బావిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

మృతులిద్దరూ ఇంటర్‌ విద్యార్థులు

పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని

మనస్తాపం

బావి వద్ద సూసైడ్‌ నోట్‌ లభ్యం

కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు

కె.కోటపాడు: తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని మనస్తాపానికి గురైన ఇద్దరు మైనర్లు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కె.కోటపాడులో చోటుచేసుకుంది. దుంగల కనిష్క సత్యసాగర్‌ (16), షీలా అరుణ (16) ఇద్దరూ ఇంటర్‌ చదువుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివి. కనిష్క సత్యసాగర్‌ తండ్రి రమణ పెందుర్తిలో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి స్వగ్రామం తుని సమీపంలోని వెలమ కొత్తూరు. షీలా అరుణ తండ్రి అర్జునరావు స్వగ్రామం విజయనగరం జిల్లా ఎల్‌.కోట మండలం గంగుబూడి. ఈయన కూడా పెందుర్తిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెందుర్తిలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సమయంలో సత్యసాగర్‌, అరుణ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనంతరం అరుణను భీమిలి మండలం ఆనందపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, సత్యసాగర్‌ను ఎస్‌.కోటలోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌లో చేర్పించారు.

వేర్వేరు ప్రాంతాల్లో చదువుతున్నప్పటికీ వీరిద్దరూ ప్రేమను కొనసాగించారు. వారి ప్రేమ వ్యవహారం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో పలుమార్లు ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. వారిని తీసుకువచ్చిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మైనర్లు కావడంతో వివాహ వయసు వచ్చే వరకు వేచి ఉండాలని పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్టు కె.కోటపాడు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అరుణ చదువును తల్లిదండ్రులు మధ్యలోనే నిలిపివేసి ఇంటి వద్ద ఉంచారు. ఈ నేపథ్యంలో పెందుర్తిలో ఉంటున్న సత్యసాగర్‌, అరుణ ఈ నెల 15వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయలుదేరి సత్యసాగర్‌ అమ్మమ్మ ఊరైన కె.కోటపాడుకు వచ్చారు. 16న అక్కడి నుంచి వెళ్లిపోయారు. కె.కోటపాడు సమీపంలోని పైడమ్మ చెరువు వద్ద ఉన్న బావిలో గురువారం ఇద్దరి మృతదేహాలు తేలి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతులను పెందుర్తికి చెందిన కనిష్క సత్యసాగర్‌, షీలా అరుణగా గుర్తించారు. బావి వద్ద సత్యసాగర్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ లభించిందని పోలీసులు తెలిపారు. దానిని వారి తల్లిదండ్రులకు అందజేశారు. అరుణ తండ్రి అర్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఆర్‌.ధనుంజయ్‌ తెలిపారు. మృతదేహాలకు కె.కోటపాడు సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement