విశాఖ విద్య: విశాఖ నగరంలో ప్రతినెలా ఎక్కడోచోట ఆత్మహత్యల రూపంలో విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఒక జీవితం ముగిసిపోవడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్న ఉదంతాలు కోకొల్లలు. ఆత్మహత్యలకు ప్రేరణ ఎలా మొదలవుతుంది? ఆత్మహత్య చేసుకునే ముందు కనిపించే లక్షణాలు ఎలాంటివి? వీటిని నివారించవచ్చా? అనే ప్రశ్నలకు మానసిక నిపుణులు ‘ఖచ్చితంగా సాధ్యమే’నని భరోసా ఇస్తున్నారు.
విద్యార్థులు, యువతే ఎక్కువ!
ఈ దశాబ్దంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య అత్యధికంగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 18 నుండి 30 ఏళ్ల వయసువారే ఎక్కువగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఒత్తిడి, పరీక్షల్లో వైఫల్యాలు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఉద్యోగ భద్రత లేకపోవడం కూలీలు, శ్రామికుల బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. యువతలో ఉద్యోగ సంబంధిత సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళన, సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లు కారణమైతే, కుటుంబ సమస్యలతో విసిగి వేసారి ఆత్మహత్యే శరణ్యమని మహిళలు భావిస్తున్నారు.
ముందస్తు సంకేతాలు గుర్తించాలి
విశాఖకు చెందిన సైకాలజిస్ట్ డా.పూజిత జోస్యుల ‘హోల్డ్ ఆన్: సూసైడ్ వ్యాక్సినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్’అనే పుస్తకంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తుల హెచ్చరిక సంకేతాలను గుర్తించలేకపోవడం వల్లే దుర్ఘటనలు జరుగుతున్నాయి. గుర్తించినా ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయాల్లోనే ‘సూసైడ్ ఫస్ట్ ఎయిడ్’అత్యంత అవసరమని డా.పూజిత చెప్తున్నారు. తీవ్ర మానసిక వేదనతో ఒంటరిగా ఉన్న వారి పక్కన సరైన వ్యక్తి ఉండి, వారి మాటలను ఓపికగా వింటే ఆ ఆలోచనల నుంచి దూరం చేయవచ్చు. నిత్యం వారితో కలిసిమెలిసి ఉంటూ తల్లిదండ్రులు, స్నేహితులు భరోసా కల్పించాలి. తీర్పులు ఇవ్వకుండా, వారి బాధను అర్థం చేసుకుంటూ అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలి.
జూన్ 25 పీఎం పాలెంలో 25 ఏళ్ల వివాహిత ఆత్మహత్య
జూలై 24 ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ చదువుతున్న పీజీ విద్యార్థిని హాస్టల్ రూమ్‌లో ఆత్మహత్య.
అగస్టు30 పెందుర్తి మండలం చింతలఅగ్రహారంలో అప్పుల బాధకు ఆటో డ్రైవర్ వినోద్ భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య
సెప్టెంబర్ 14 మధురవాడ ఆర్టీసీ కాలనీలో కుటుంబ గొడవలతో వివాహిత ఆత్మహత్య
ఇలాంటి ఆత్మహత్యలు ఇటీవల విపరీతంగా పెరుగుతున్నాయి. తాత్కాలిక ఆవేశం, బాధకు లోనై తక్షణ నిర్ణయాలతో తనువు చాలిస్తున్నారు. చుట్టూ ఉన్నవారు కాస్త గమనిస్తే ఇలాంటి వారిని కాపాడుకోవచ్చని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


