ప్రత్యేక రిమిషన్‌పై ఖైదీ విడుదల
ఆరిలోవ: ఓ హత్య కేసులో 16 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని విశాఖ కేంద్ర కారాగారం నుంచి ప్రత్యేక రిమిషన్(సత్ప్రవర్తన, వయసు, ఇతర మానవతా అంశాల)పై గురువారం విడుదలచేశారు. హోమ్ డిపార్ట్‌మెంట్ జీవో నం.174 ప్రకారం ఇక్కడి నుంచి ఒక ఖైదీ విడుదలైనట్లు కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి బి.చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక రిమిషన్ ద్వారా రాష్ట్రంలో ముగ్గురు ఖైదీలకు అవకాశం లభించిందన్నారు. వారిలో విశాఖ జైల్ నుంచి లాలం రాము(46) ఉన్నట్లు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం రాజకోడూరు గ్రామానికి చెందిన రాము ఓ హత్య కేసులో 16 ఏళ్లు జైల్ శిక్ష అనుభవించాడన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక రిమిషన్‌తో నిబంధనల మేరకు ఆయన్ని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి నుంచి రాము బయట ప్రపంచంలో కుటుంబ సభ్యులతో కలిసి, బయట ప్రపంచంలో బాధ్యతాయుతంగా మెలగాలని ఆకాంక్షించారు.


