మళ్లీ వాత..! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ వాత..!

May 26 2026 8:00 AM | Updated on May 26 2026 8:00 AM

10 రోజుల్లో నాలుగోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు

లీటరు పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 వడ్డన

విశాఖలో లీటరు పెట్రోల్‌ రూ.116.38, డీజిల్‌ రూ.104.10

మహారాణిపేట: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గట్టి వాత పెట్టింది. గత పది రోజుల్లో వరుసగా నాలుగో సారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరిచింది. తాజాగా సోమవారం ఇంధన ధరల పెంపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. చమురు సంస్థలు లీటరు పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంచేశాయి. తాజా పెంపుతో విశాఖపట్నంలో లీటరు పెట్రోల్‌ ధర ఏకంగా రూ.116.38కి చేరగా, డీజిల్‌ ధర రూ.104.10కి చేరుకుంది.

సాకు అంతర్జాతీయం.. భారం స్థానికం!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయని, చమురు సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్తూ కేంద్ర ప్రభుత్వం ఈ భారాన్ని ప్రజలపైకి నెట్టేసింది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను సాకుగా చూపిస్తూ సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వినియోగదారుల ఆందోళన

డీజిల్‌ ధరలు దశలవారీగా ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్యుడి బతుకు భారంగా మారుతోంది. ఇంధన ధరల ఆమాంతం పెంపు ప్రభావం అన్ని రంగాలపైనా తీవ్రంగా పడుతోంది. రవాణా చార్జీలు పెరగడంతో మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు మళ్లీ మండిపోయే ప్రమాదం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నగరంలో లారీల రవాణా చార్జీలతో పాటు, ఆటో ప్రయాణాల ధరలు కూడా పెరిగాయి. మరోవైపు నిత్యం వేలాది లీటర్ల డీజిల్‌ను వినియోగించే ఆర్టీసీ బస్సులపై ఈ పెంపు తీవ్ర అదనపు భారాన్ని మోపనుంది. అటు విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లోని వేలాది బోట్లకు డీజిలే ప్రధాన ఇంధనం కావడంతో, స్థిరంగా లేని ధరల వల్ల మత్స్యకార రంగం కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం స్పందించి పన్నులు తగ్గించి ధరలను అదుపు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement