ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం

May 24 2026 1:39 AM | Updated on May 24 2026 1:39 AM

పీఎం పాలెం: జాతీయ రహదారిపై ఆర్‌టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ సీఐ జీ. బాలకృష్ణ వెల్లడించారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం, కొరపు కృష్ణాపురం గ్రామానికి చెందిన దున్నాన మోహనరావు (26) మధురవాడ బోరవాని పాలెం సమీపంలోని ఐకానిక్‌ రెడీమిక్స్‌ ప్రైవేటు ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. శనివారం మోహనరావు బోరవానిపాలెం నుంచి కొమ్మాది వైపునకు జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వస్తుండగా.. ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా శ్రీకాకుళం నుంచి విశాఖ వస్తున్న నాన్‌స్టాప్‌ ఆర్‌టీసీ బస్సు అతడి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిపోయిన మోహనరావు తలపై నుంచి బస్సు వెనుక చక్రాలు దూసుకుపోవడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు అవివాహితుడు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పీఎంపాలెం ట్రాఫిక్‌ సీఐ సాయి, ఎస్‌ఐ ఏ. మన్మథరావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను క్రమబద్ధీకరించి పరిస్థితిని చక్కదిద్దారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడు చిన్నాన్న లక్ష్మీనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement