డాబాగార్డెన్స్: ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకాన్ని ఎంత మందికి అందించిందో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ డిమాండ్ చేశారు. నిధుల ఎగవేతకు నిరసనగా ఈ నెల 23న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. గురువారం ఆశీల్‌మెట్ట కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ధర్నా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చాయని, సొంత ఇల్లు ఉందని సాకులు చెబుతూ అర్హులైన పేద మత్స్యకారులను జాబితా నుంచి తొలగించడం దుర్మార్గమన్నారు. నష్టాల్లో ఉన్న బోటు యజమానులను కూడా ఆదుకోవాలన్నారు. గంగపుత్రులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని, అర్హులైన ప్రతి కుటుంబానికి భరోసా దక్కే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.


