అన్నమయ్య పద నర్తనం..మంత్రముగ్ధం | - | Sakshi
Sakshi News home page

అన్నమయ్య పద నర్తనం..మంత్రముగ్ధం

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

ఏయూ క్యాంపస్‌: భగవంతుడికి మనలోని భక్తిని మాత్రమే సమర్పించాలని అన్నమాచార్య వంశస్థులు తాళ్లపాక హరి నారాయణాచార్యులు అన్నారు. విశాఖ ఆర్ట్‌ అండ్‌ డ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య శోభాయాత్ర, అన్నమయ్య పద నర్తనం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, బీచ్‌రోడ్డులోని అన్నమయ్య విగ్రహం వద్ద నిర్వహించిన పద నర్తనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ..‘ధనంతో కేవలం కొన్నింటిని మాత్రమే సంపాదించగలం..అదే విద్య ఉంటే దేన్నయినా పొందవచ్చు. కాబట్టి విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సరస్వతీ కటాక్షం ఉన్నచోట లక్ష్మీ కటాక్షం దానంతట అదే సిద్ధిస్తుంది’అని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రతి ఒక్కరూ అన్నమాచార్య సంకీర్తనల్లో దాగి ఉన్న భావాలను, తాత్పర్య రహస్యాలను తెలుసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో నిత్యం సంకీర్తనలు గానం చేసే భాగ్యం తనకు దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించే వారి వద్దనే భగవంతుడు కొలువై ఉంటాడని స్పష్టం చేశారు. నేటి చిన్నారులు విజ్ఞానాన్ని సముపార్జించి దేశ ప్రగతికి పాటుపడాలని, జ్ఞానం, విజ్ఞానం, అజ్ఞానం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించాలని హితబోధ చేశారు. అనంతరం తిరుమల శ్రీవారి ఏకాంత సేవలో ఆలపించే గీతాలను ఆయన సుమధురంగా పాడి.. భక్తులను మంత్రముగ్ధులను చేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చేసిన పద నర్తనం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ కందుల నాగరాజు, నాట్య గురువులు కళారత్న హరి రామమూర్తి, వీఏడీఏ జనరల్‌ సెక్రటరీ కన్నం వెంకట రమణారావు, బ్రహ్మకుమారి రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement