డాబాగార్డెన్స్: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దళితులు, దళిత క్రైస్తవులపై చేస్తున్న వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం అండదండలున్నాయని మాల మహనాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి, రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తున్న ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శనివారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం చింతాడ ఆనంద్ కేసులో దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీ స్టేటస్ రద్దు అవుతుందని తీర్పు ఇచ్చిందని, అయితే ఆ తీర్పులో ఎస్టీ, బీసీ, ఓసీ కులాలకు చెందిన క్రైస్తవులపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. ఈ తీర్పు మిగిలిన వర్గాల క్రైస్తవులకు వర్తించదా అని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చి నేటికి 77 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కుల వివక్ష, అంటరానితనం, గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతూనే ఉన్నాయన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇటీవల దళితులు, దళిత క్రైస్తవుల గురించి చాలా హీనంగా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో దళితులందరూ క్రైస్తవులని సంబోధించి మాట్లాడడం దారుణమన్నారు. హిందూ మతంలో ఉన్న హిందూ దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సరికాదన్నారు. డిప్యూటీ స్పీకర్ వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసినట్టు వార్తలు వస్తున్నాయని, ఒక ఉన్నతాధికారితో ఆయనకున్న వ్యక్తిగత విభేదాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో ఉన్న దళితులకు ఆపాదించడం మంచిది కాదని హెచ్చరించారు. అలాంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్‌గా ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని, చంద్రబాబు సర్కార్ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజుకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయని, ముఖ్యంగా చంద్రబాబుకి, రఘురామకు మధ్య లాలూచీ ఉందని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫ్లెక్సీ తన దారికి అడ్డుగా లేకపోయినప్పటికీ, కార్యకర్తల మెప్పుకోసం రఘురామ తన చేతులతో ఫ్లెక్సీని చింపి వేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు.


