ప్లాస్టిక్‌ రహిత విశాఖే లక్ష్యంగా పనిచేద్దాం | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ రహిత విశాఖే లక్ష్యంగా పనిచేద్దాం

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ పిలుపు

ఎంవీపీకాలనీ: ప్లాస్టిక్‌ రహిత విశాఖే లక్ష్యంగా అంతా కలిసికట్టుగా పనిచేద్దామని నగర ప్రజలకు కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రామిరెడ్డితో కలిసి, స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025–2026 సంవత్సరానికి గాను విశాఖ ప్రథమ స్థానం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికలను వివరించడంతో పాటు ఉద్యోగులకు అవగాహన కల్పించారు. శివాజీ పార్క్‌ వేదికగా శనివారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..రూ.1,500 కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వ్యర్థాల కోసం డస్ట్‌బిన్‌లను తప్పనిసరిగా వాడాలని, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా బహిష్కరించాలన్నారు. నేషనల్‌ డెంగ్యూ డేని గుర్తు చేస్తూ.. ఇళ్లతో పాటు నగర పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. అనంతరం కలెక్టర్‌ ‘సే నో టు ప్లాస్టిక్‌–బ్రింగ్‌ యువర్‌ ఓన్‌ బ్యాగ్‌’ నినాదంతో కూడిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. పారిశుధ్య మెరుగుదలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు పారిశుధ్య కార్మికులను సన్మానించారు. అలాగే పారిశుధ్యం, వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్‌ నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్‌, ఈస్ట్‌ జోన్‌ కమిషనర్‌ శివప్రసాద్‌, డీపీవో నాగార్జునరావు, డీడీహెచ్‌ ఇన్‌చార్జి వాసుకి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement