కలెక్టర్‌కు ఇన్‌చార్జి ఆర్డీవో శేష శైలజ లేఖ?
మహారాణిపేట: విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి(ఇన్‌చార్జి)గా ఉన్న శేష శైలజ తనను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆమె కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌కు లేఖ సమర్పించినట్లు తెలిసింది. ప్రస్తుతం కలెక్టరేట్‌లో ఉన్న కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న శేష శైలజను, అప్పటి కలెక్టర్ ఇన్‌చార్జి ఆర్డీవోగా నియమించారు. అప్పటి నుంచి ఆమె ఆర్డీవోగా, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్‌గా రెండు పదవుల్లోనూ కొనసాగుతున్నారు. గత ఏడాది అక్టోబర్ 21న అప్పటి డీఆర్వో బి.హెచ్.భవానీ శంకర్, ఆర్డీవో పి.శ్రీలేఖలను ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో అప్పటి హెచ్‌పీసీఎల్ భూసేకరణ అధికారిగా పనిచేస్తున్న సనపల సుధాసాగర్‌ను ఇన్‌చార్జి ఆర్డీవోగా నియమించారు. కొంతకాలం తర్వాత సుధాసాగర్ విజయనగరం ఆర్డీవోగా బదిలీ కావడంతో, ఆయన అప్పటికప్పుడు రిలీవ్ అయ్యారు. ఆ సమయంలో కలెక్టరేట్ కేఆర్సీలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న శేష శైలజకు ఇన్‌చార్జి ఆర్డీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే విశాఖ ఆర్డీవో పోస్టుకు ప్రోటోకాల్ బాధ్యతలు ఎక్కువగా ఉండడంతో, తాను ఈ అదనపు బాధ్యతలను నిర్వహించలేనని శేష శైలజ కలెక్టర్‌కు లేఖ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై ప్రస్తుతం కలెక్టరేట్‌లో జోరుగా చర్చ సాగుతోంది. తదుపరి ఆర్డీవో బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై అధికారులు ఆలోచనలో పడ్డారు.


