నిద్రమత్తులో సర్కారు వైద్యం | - | Sakshi
Sakshi News home page

నిద్రమత్తులో సర్కారు వైద్యం

May 16 2026 4:59 AM | Updated on May 16 2026 4:59 AM

● ప్రశ్నిస్తే డిశ్చార్జ్‌ చేస్తారా? ● ఛాతి ఆసుపత్రి నిర్వాకం ● సిబ్బందిపై కలెక్టర్‌కు ఫిర్యాదు ● విచారణ కమిటీ నియామకం

బీచ్‌ రోడ్డు: వైద్యరంగంలో స్టాఫ్‌ నర్సుల పాత్ర ఎంతో విశిష్టమైనది. రోగుల పట్ల కన్నతల్లిలా, తోడబుట్టినవారిలా ప్రేమను చూపిస్తూ, వారిని ఆరోగ్యవంతులుగా మార్చడంలో వైద్యుల కంటే నర్సులే ఎక్కువ సమయం వెచ్చిస్తుంటారు. అయితే అటువంటి పవిత్రమైన వృత్తికి కొందరి నిర్లక్ష్యం మాయని మచ్చగా మారుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు అందించే క్రమంలో కొంతమంది సిబ్బంది చూపిస్తున్న అలసత్వం సామాన్య ప్రజల పాలిట శాపంగా మారుతోంది. విధి నిర్వహణలో ఉండి కూడా వార్డులను వదిలి గాఢ నిద్రలోకి వెళ్లడం, రోగి బంధువులపై అహంకారంగా ప్రవర్తించడం వంటి ఘటనలు విస్మయానికి గురిచేస్తున్నాయి.

నొప్పితో విలవిలలాడినా కరగని మనసు..

ఇందుకు నిదర్శనంగా పెదవాల్తేరులోని ప్రభుత్వ ఛాతి ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన అత్యంత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కడుపునొప్పితో బాధపడుతున్న ఒక బాలికను మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి పంపగా, అక్కడ ఆమెకు ఎదురైన అనుభవం వర్ణనాతీతం. గత నెల 27న ఆసుపత్రిలో చేరిన ఆ బాలికకు శనివారం సాయంత్రం నుంచి విపరీతమైన నొప్పి రావడంతో రోగి తల్లి నర్సుల సహాయం కోరింది. అయితే ఆ సమయంలో సేవలు అందించాల్సిన సిబ్బంది కనీస మానవత్వం లేకుండా.. ‘మేము రేపు డ్యూటీకి రావాలా వద్దా’.. అంటూ ఆమెను గద్దించి పంపేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న రోగి తండ్రి వచ్చి చూసేసరికి అక్కడి సిబ్బంది అందరూ విధులను గాలికి వదిలేసి గాఢ నిద్రలో ఉన్నారు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు లేకపోవడం చూస్తుంటే వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

ప్రశ్నిస్తే ‘డిశ్చార్జ్‌’ వేటు..

అంతటితో ఆగకుండా.. బాధితులు ప్రశ్నించినందుకు గానూ ఆసుపత్రి ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు మరింత విచారకరం. ఆ బాలికను అత్యవసర స్థితిలో 108 ద్వారా కేజీహెచ్‌కు తరలించాల్సి వచ్చింది. తీరా అక్కడ నొప్పి తగ్గాక తిరిగి వార్డుకు తీసుకొస్తే, మీకు టీబీ లేదు, మీకు డిశ్చార్జ్‌ ఇచ్చేసాం.. అంటూ కనికరం లేకుండా బయటకు పంపేశారు. ఆదివారం నాడు ఆ రోగిని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ఆ కుటుంబం పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. చివరికి ప్రైవేట్‌ వైద్యుడిని సంప్రదిస్తే అది ‘పేగు టీబీ’ అని తేలడం, ఇక్కడి ప్రభుత్వ వైద్యుల నిర్ధారణలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రశ్నించినందుకు రోగులను ఆసుపత్రి నుంచి వెళ్లగొట్టడం అంటే అది శిక్షించడమే తప్ప చికిత్స అందించడం అనిపించుకోదు.

అందుకే ప్రైవేట్‌కు ఆశ్రయం

రోగులను అంటురోగస్తులుగా చూస్తూ, ప్రతి చిన్న విషయానికి లంచాలు ఆశిస్తూ, ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించే ఇలాంటి సిబ్బంది వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల ప్రతిష్ట మంటగలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల వల్లే పేద ప్రజలు అప్పులు చేసైనా ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కేవలం తూతూమంత్రపు చర్యలు చేపట్టి వదిలేయడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఒక నిండు ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు నిద్రపోతున్న సిబ్బందిపై, అలాగే వారిని వెనకేసుకొస్తున్న ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ తండ్రి పీజీఆర్‌ఎస్‌ ద్వారా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.

కలెక్టర్‌ ఆదేశం.. విచారణ కమిటీ నియామకం

ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్‌, అంతర్గత విచారణకు ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ఇద్దరు ప్రొఫెసర్లతో కూడిన కమిటీ ఏర్పాటైంది. అయితే ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని ప్రజలు కోరుతున్నారు.

బాధ్యులపై కఠిన చర్యలు

తీసుకుంటాం

దరు యువతికి మెరుగైన చికిత్స అందించేందుకు మా వైద్య బృందం సిద్ధంగా ఉంది. ఆ రాత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరుపై బాధితులకు క్షమాపణలు తెలిపాం. వారు తిరిగి వస్తే ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యం అందిస్తాం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

–డాక్టర్‌ సునీల్‌,

ఛాతి ఆసుపత్రి సూపరింటిండెంట్‌

Advertisement
 
Advertisement
Advertisement