అప్పన్న భూములకు శఠగోపం | - | Sakshi
Sakshi News home page

అప్పన్న భూములకు శఠగోపం

Apr 27 2026 8:24 AM | Updated on Apr 27 2026 8:24 AM

ప్రైవేటు సంస్థకు పంచగ్రామాల భూములు ధారదత్తం లీజు పేరిట భూముల సంతర్పణ నిబంధనలకు విరుద్దంగా భూ పందేరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హిందూ ధార్మిక సంస్థలు

మహారాణిపేట: సింహాచలం దేవస్థానానికి చెందిన సుమారు 160 ఎకరాల భూమిని గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం లీజుకు ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అడవివరం సర్వే నంబర్‌ 275లో 153 ఎకరాలు, ముడసర్లోవలోని సర్వే నంబర్‌ 26లో మరో 7 ఎకరాలను 11 ఏళ్ల కాలానికి లీజుకు ఇస్తూ దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లీజు ద్వారా ఏటా రూ.26 కోట్ల ఆదాయం సమకూరుతుందని, ప్రతి ఐదేళ్లకు ఒకసారి లీజు మొత్తం 5 శాతం పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఈ నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అభివృద్ధి పేరుతో ఆలయ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం సరికాదని, ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ వీహెచ్‌పీ అధ్యక్షుడు ఆచార్య కందర్ప విశ్వనాథ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు లేఖ రాశారు. దేవాలయాల ఆస్తులను దేవాలయ అభివృద్ధికి తప్ప, ఇతర అవసరాలకు వాడకూడదని సుప్రీంకోర్టు సహా పలు ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ భూ వివాదాల మూలాలు దశాబ్దాల నాటి పంచగ్రామాల సమస్యలో ఉన్నాయి. భీమిలి, పెందుర్తి, విశాఖ పశ్చిమ నియోజకవర్గాల్లోని అడవివరం, వేపగుంట, పురుషోత్తపురం, చీమలాపల్లి, వెంకటాపురం గ్రామాలను పంచగ్రామాలుగా పిలుస్తారు. 1901 గిల్‌ మెన్‌ రికార్డుల ప్రకారం ఈ ప్రాంతాల్లో దేవస్థానానికి 9069 ఎకరాల భూమి ఉంది. 1996లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ భూములపై దేవస్థానానికి రైత్వారీ పట్టాలు దక్కాయి. దీంతో ఏళ్లుగా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారు, సాగు చేసుకుంటున్న రైతులు ఆక్రమణదారులుగా మారారు. సుమారు 12 వేల మందికి పైగా ప్రభావితమవుతున్న ఈ అంశం ప్రస్తుతం జిల్లా, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్‌లో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, పెండింగ్‌లో ఉన్న పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతుండగా, ప్రభుత్వం మాత్రం అదే భూముల్లో మరోవైపు వాణిజ్య లీజులకు ప్రాధాన్యత ఇస్తుండటం తీవ్ర వివాదానికి దారితీస్తోంది.

జీవోను తక్షణం రద్దు చేయాలి

లయాల భూములను వాణిజ్య అవసరాలకు కేటాయించడం సరికాదు. అప్పన్న దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని గూగుల్‌ డేటా సెంటర్‌ కోసం కేటాయించిన జీవోను తక్షణమే రద్దు చేయాలి. అభివృద్ధి పేరుతో ఎవరికి పడితే వారికి ఆలయ ఆస్తులను ధారదత్తం చేయడం అప్రజాస్వామికం. ఆలయ భూముల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

– ఆచార్య కందర్ప విశ్వనాఽథ్‌, అధ్యక్షుడు,

విశ్వహిందూ పరిషత్‌ విశాఖ మహానగర్‌

Advertisement
 
Advertisement
Advertisement