ప్రేమ వైఫల్యమే కారణం?
ఆరిలోవ/కొమ్మాది: పోస్టల్ ఉద్యోగిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. శ్రీకాకుళం జిల్లా దాసవరపు గ్రామానికి చెందిన పుత్రకాండ భాస్కరరావు కుటుంబం కొన్నాళ్ల కిందట విశాఖకు వలస వచ్చి ఎండాడ రాజీవ్‌నగర్‌లో నివాసముంటోంది. భాస్కర్ ఎంవీపీ సూపర్‌మార్కెట్‌లో కలాసీగా పనిచేస్తుండగా, ఆయన భార్య నీలవేణి కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కుమార్తె సంధ్యారాణి (22) పీఎంపాలెం పోస్టాఫీసులో పోస్ట్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తోంది. గతంలో శ్రీకాకుళంలో పనిచేసిన సమయంలో ఓ యువకుడితో ప్రేమలో పడిన సంధ్యారాణి.. ఆ ప్రేమ విఫలం కావడంతో కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉంటోంది. కాగా.. శనివారం సాయంత్రం యథావిధిగా విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న ఆమె, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. బయటకు వెళ్లిన తల్లి నీలవేణి తిరిగి వచ్చేసరికి కుమార్తె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే స్థానికుల సహాయంతో కిందకు దించి గీతం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.


