విశాఖ ‘పెట్రో’ వేగం | - | Sakshi
Sakshi News home page

విశాఖ ‘పెట్రో’ వేగం

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

రాయ్‌పూర్‌ వరకూ పెట్రోలియం ఉత్పత్తుల

రవాణాకు కామన్‌ కారిడార్‌

అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేసిన

కేంద్ర ప్రభుత్వం

లైన్‌ కోసం పెందుర్తి మండలంలో

7.175 కిమీ మేర కీలక గ్రామాల ఎంపిక

సాక్షి, విశాఖపట్నం : పారిశ్రామిక నగరం విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌ వరకు ఇంధన రవాణాలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే ‘పెట్రో కారిడార్‌’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌తో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమలుకు మార్గం సుగమమైంది. హెచ్‌పీసీఎల్‌ విశాఖ రిఫైనరీ నుంచి ఉత్పత్తి అయ్యే పెట్రోలియం ఉత్పత్తులను పొరుగు రాష్ట్రాలకు వేగంగా చేరవేయడమే ఈ ‘కామన్‌ కారిడార్‌’ లక్ష్యం. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వంటి రాష్ట్రాలకు ఇంధన సరఫరా మరింత సమర్థవంతంగా మారనుంది.

పాత మార్గమే.. కొత్త రూటు!

కొత్తగా భూసేకరణ సమస్యలు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 1998లో విశాఖ నుంచి విజయవాడ వరకు ఇంధన రవాణా కోసం ఏర్పాటు చేసిన పాత పైప్‌లైన్‌ మార్గాన్నే ఈ కొత్త ప్రాజెక్టుకు కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది. దీనివల్ల అటు పర్యావరణ అనుమతులు, ఇటు ప్రాజెక్టు వ్యయం భారీగా తగ్గనున్నాయి.

2022లో హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ

ఆధునీకరణే కీలకం.!

2022లో విశాఖలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీని భారీ ఎత్తున ఆధునీకరించడంతో ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఈ అదనపు పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తులను ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాలకు సురక్షితంగా, వేగంగా చేరవేయడమే ఈ రూ. 2,212 కోట్ల ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. విశాఖను దక్షిణ భారతదేశపు అతిపెద్ద ఇంధన సరఫరా కేంద్రంగా మార్చనుంది. సుమారు 540 కిమీ పొడవైన పైప్‌లైన్‌ ద్వారా ఏడాదికి 3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 2027 సెప్టెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఇంధన రవాణా చేయడం వ్యయంతో పాటు.. ప్రమాదకరమైన అంశంగా మారనుంది. అందుకే ఈ భూగర్భ పైప్‌లైన్‌ రవాణా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుంది.

స్కాడా ద్వారా పర్యవేక్షణ

భద్రత విషయంలో రాజీ లేకుండా ఈ పైప్‌లైన్‌ వ్యవస్థను అత్యున్నత సాంకేతికతతో నిర్మిస్తున్నారు. విశాఖ–రాయ్‌పూర్‌ ఎకనామిక్‌ కారిడార్‌ని అనుసంధానిస్తూ సాగే ఈ మార్గంలో అత్యాధునిక మానిటరింగ్‌ సిస్టమ్‌ ‘స్కాడా’ని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా రిఫైనరీ నుంచి పైప్‌లైన్‌ ఒత్తిడిని, ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించవచ్చు. ఏదైనా లీకేజీ లేదా సాంకేతిక సమస్య తలెత్తితే సెన్సార్ల ద్వారా తక్షణమే గుర్తించి సరఫరాను నిలిపివేసేలా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

పెందుర్తిలో కీలక అడుగు

తాజా గెజిట్‌ ప్రకారం పెందుర్తి మండల పరిధిలో 7.175 కి.మీ మేర పైప్‌లైన్‌ విస్తరణకు భూములను గుర్తించారు.

నరవ గ్రామం: 76 సర్వే భాగాలు.

జెర్రిపోతులపాలెం: 17 సర్వే భాగాలు.

ఈ ప్రాంతాల్లో పైప్‌లైన్‌ నిర్మాణం కోసం వినియోగ హక్కులను ప్రభుత్వం ఖరారు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement