సింహాచలం: సింహగిరి శిఖరాన కొలువై ఉన్న ఆ వరాహ లక్ష్మీనృసింహస్వామివారికి, విశాఖ తీరంలోని జాలర్లకు మధ్య ఉన్న అనుబంధం విడదీయలేనిది. చైత్రశుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగే స్వామివారి వార్షిక కల్యాణోత్సవానికి ముందు, సింహగిరి మాడ వీధుల్లో రథోత్సవం కనుల పండువగా సాగుతుంది. ఈ బృహత్తర వేడుకను విజయవంతంగా నడిపించే బాధ్యతను 63వ సారి జాలారి పెద్ద, రథసారథి కదిరి లక్ష్మణరావు స్వీకరించబోతున్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారికి తాము పుట్టింటి వారమని భావించే జాలర్లందరూ, అప్పన్నను తమ ఆరాధ్యదైవంగా కొలుస్తూ, ఈ రథోత్సవంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సేవ ఈనాటిది కాదు.. తరతరాల నుంచి ఒక పవిత్ర వారసత్వంగా కొనసాగుతోంది. కదిరి లక్ష్మణరావు ముత్తాత సూర్యనారాయణ, తాత నారాయణ, తండ్రి గవరయ్యలు కూడా స్వామివారి రథాన్ని నడిపించిన వారే. వీరి కుటుంబమే రథసారథ్య బాధ్యతలు వహించాలని పూర్వమే విజయనగర సంస్థానాదీశులు శాసనం చేయడం విశేషం. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న లక్ష్మణరావు, 1963 నుంచి నేటి వరకు అవిశ్రాంతంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో రథసారథిగా తన సేవలను అందిస్తున్నారు.
సముద్ర తీరం నుంచి సింహగిరి వరకూ..
రథోత్సవ తేదీ ఖరారు కాగానే.. సింహాచలం దేవస్థానం నుంచి లక్ష్మణరావుకు అధికారిక ఆహ్వానం అందుతుంది. వెంటనే ఆయన విశాఖ తీర ప్రాంతాలైన భీమునిపట్నం, కోటవీధి, గంగవరం, దిబ్బపాలెం, జాలారి ఎండాడ, మల్కాపురం, కొత్త, పెద జాలారిపేటల జాలర్లకు సమాచారం పంపిస్తారు. అప్పన్న పిలుపు విన్న జాలర్లంతా తమ కుటుంబాలతో సహా సింహగిరికి తరలివస్తారు. రథం కదలికలను నియంత్రించడం, మలుపుల వద్ద చక్రాలకు చెక్క చొప్పలు వేయడం, జాకీని తిప్పడం వంటి కఠినమైన పనులను లక్ష్మణరావు సూచనల మేరకు వారు అత్యంత నైపుణ్యంతో నిర్వహిస్తారు. ఈ సేవ ముగిశాక దేవస్థానం అందించే బియ్యం, ఇతర పదార్థాలను వారు మహాప్రసాదంగా భావించి స్వీకరిస్తారు.
తండ్రి అడుగుజాడల్లో తనయ
ఈ అరుదైన సంప్రదాయంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. లక్ష్మణరావు తన నలుగురు కుమార్తెలలో చిన్న కుమార్తె అయిన సౌమ్యను కూడా నాలుగేళ్లుగా ఈ సేవలో భాగస్వామిని చేస్తున్నారు. తండ్రి వెంటే ఉంటూ రథోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, జాలారి కుటుంబీకులతో కలిసి ఆమె అందిస్తున్న సహకారం అందరినీ ఆకట్టుకుంటోంది. సంప్రదాయాలను తర్వాతి తరానికి చేరవేయడంలో లక్ష్మణరావు చూపిస్తున్న చొరవ అభినందనీయం.
అంతా ఆ స్వామి అనుగ్రహమే
‘63వ సారి అప్పన్న రథసారథిగా సేవ చేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం’ అని లక్ష్మణరావు ఎంతో వినమ్రంగా చెబుతారు. రథోత్సవానికి కొద్ది రోజుల ముందే కొండపైకి చేరుకుని, రథం మరమ్మతులు, కదలికలను స్వయంగా పర్యవేక్షించే ఆయన, ఈ బాధ్యతను దైవకార్యంగా భావిస్తారు. విశాఖ నగరవ్యాప్తంగా ఉన్న జాలారి సోదరుల సహకారం లేనిదే ఇది సాధ్యం కాదని, ఆ స్వామి దయ ఉన్నంత కాలం ఈ సేవను కొనసాగిస్తానని ఆయన విశ్వసిస్తున్నారు.


