ఆకాశన్నంటుతున్న సిలిండర్ ధర బ్లాక్‌లో రూ. 3,000 వరకు విక్రయం కొరతను ‘క్యాష్’ చేసుకుంటున్న దళారులు నిమ్మకు నీరెత్తినట్లు విజిలెన్స్, సివిల్ సప్లై విభాగాలు
ఎంవీపీకాలనీ: నిత్యం పొయ్యి వెలగాలంటే గ్యాస్ సిలిండర్ ఉండాల్సిందే. కానీ, ప్రస్తుతం విశాఖ నగరంలో గ్యాస్ సిలిండర్ పొందడం సామాన్యుడికి గగనమైపోతోంది. అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావంతో దిగుమతులు మందగించి కొరత ఏర్పడటాన్ని కొందరు దళారులు ‘కాసుల వర్షం’గా మార్చుకుంటున్నారు. అరకొరగా వస్తున్న స్టాక్‌ను సామాన్యులకు చేరకుండా పక్కదారి పట్టిస్తూ బ్లాక్ మార్కెట్‌కు తెరలేపుతున్నారు.
ధర రూ. 923.. దందా రూ. 3,000
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ. 923 ఉండగా, బ్లాక్ మార్కెట్‌లో అది ఏకంగా రూ. 2,500 నుంచి రూ. 3,000 వరకు పలుకుతోంది. గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ల వద్ద పనిచేసే సిబ్బంది, డెలివరీ బాయ్స్ కొందరు దళారులతో చేతులు కలిపి బుకింగ్ అయిన సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తున్నారు. డెలివరీ సిబ్బంది ఒక సిలిండర్‌ను రూ. 2,000కు దళారులకు అమ్ముతుండగా, వారు అవసరాన్ని బట్టి హోటళ్లు, రెస్టారెంట్లు, అత్యవసరమున్న వినియోగదారులకు రూ. 3,000 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
నిమ్మకు నీరెత్తిన విజిలెన్స్ ?
బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాల్సిన విజిలెన్స్, సివిల్ సప్లై విభాగాలు ప్రస్తుతం పూర్తిగా నిద్రావస్థలో ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అడపాదడపా దాడులు చేసిన ఈ విభాగాలు, ప్రస్తుతం ఇంత పెద్ద ఎత్తున దందా జరుగుతున్నా కనీసం కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దళారుల కదలికలపై అవగాహన ఉన్నప్పటికీ, అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న ’మర్మం’ ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
పెరగనున్న ఇబ్బందులు
కమర్షియల్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకడంతో, హోటల్ యజమానులు డొమెస్టిక్ (ఇంటి) సిలిండర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు దక్కాల్సిన కోటాను గండి కొడుతోంది. అర్హులైన లబ్ధిదారులకు నెలల తరబడి వేచి చూసినా సిలిండర్ దొరకని పరిస్థితి నెలకొంది.
నిఘా పెంచాలి
జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి, విజిలెన్స్, సివిల్ సప్లయ్ విభాగాలకు కఠిన ఆదేశాలు జారీ చేయాలి. గ్యాస్ గోడౌన్ల వద్ద నిఘా పెంచి, అక్రమ విక్రయాలకు పాల్పడే ఏజెన్సీలు, దళారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.


