గుజరాత్‌లో తక్కువ ధర.. మన దగ్గర ఎందుకు ఎక్కువ? | - | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో తక్కువ ధర.. మన దగ్గర ఎందుకు ఎక్కువ?

Mar 25 2026 6:50 AM | Updated on Mar 25 2026 6:50 AM

మహారాణిపేట: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం రాష్ట్రంలోని మత్స్యకారులపై తీవ్రంగా ఉందని, డీజిల్‌ కొరత కారణంగా 10 రోజులుగా వేట సాగక మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారని ఈస్ట్‌ కోస్ట్‌ మెకనైజ్డ్‌ ఫిషింగ్‌ బోట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లోని గంగమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్య పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు. డీజిల్‌ సమస్యను పరిష్కరించాలని తాము కలెక్టర్‌ను కోరినా, ఫిషరీస్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ద్వారా ఎటువంటి సహకారం అందలేదని మండిపడ్డారు. మరికొన్ని రోజుల్లో వేట నిషేధ కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో, సబ్సిడీ డీజిల్‌ సకాలంలో అందకపోతే మత్స్యకారుల పరిస్థితి దారుణంగా తయారవుతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మత్స్య పరిశ్రమను ఇండస్ట్రియల్‌ సెక్టార్‌లో చేర్చడం వల్ల లీటర్‌ డీజిల్‌పై అదనంగా రూ.24 భారం పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను గుజరాత్‌ ప్రభుత్వం ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లి పాత ధరలకే డీజిల్‌ పొందుతోందని, అక్కడ లీటర్‌ రూ.79కే లభిస్తోందని తెలిపారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మత్స్యకారుల సమస్యలను పట్టించుకోవడంలో చొరవ చూపకపోవడం వల్ల వేలాది బోట్లు హార్బర్‌కే పరిమితమయ్యాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌లో 28 ఎకరాల స్థలాన్ని సాగర్‌ డిఫెన్స్‌ ఇంజనీరింగ్‌ అనే ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టడాన్ని జానకీరామ్‌ తీవ్రంగా ఖండించారు. స్థానిక మత్స్యకారుల నుంచి ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా హార్బర్లను ప్రైవేటీకరించడం సమంజసం కాదన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మత్స్యకారుల సమస్యలపై

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement