మల్కాపురం: జీవీఎంసీ 60వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ మాజీ జిల్లా అధ్యక్షుడు కలిదిండి బద్రీనాథ్ మళ్లీ వైఎస్సార్ సీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయన తండ్రి దివంగత కలిదిండి సీతారామరాజు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, షిప్‌యార్డ్ గుర్తింపు యూనియన్ నాయకుడిగా అందించిన సేవలు జిల్లా వాసులకు సుపరిచితం. తండ్రి అడుగుజాడల్లో వైఎస్సార్ సీపీలోకి వచ్చిన బద్రీనాథ్.. పారిశ్రామిక ప్రాంత పరిధిలో పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ట్రేడ్ యూనియన్ ద్వారా కార్మిక సమస్యలను జిల్లా స్థాయిలో బలంగా వినిపించారు. అయితే, ఇటీవల ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు తన అనుచరులతో కలిసి మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు బద్రీనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ సూచనలతో పార్టీకి పూర్వ మాదిరిగా తన సేవలను అందిస్తానని స్పష్టం చేశారు. ఏ రోజున పార్టీలో చేరేది మరో రెండు రోజుల్లో వెల్లడిస్తానని బద్రీనాథ్ పేర్కొన్నారు.


