మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి
మహారాణిపేట: సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని, ఆ దిశగా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. టికెట్ల జారీ ప్రక్రియలోనూ, ఇతర ఏర్పాట్లలోనూ ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏప్రిల్ 17 నాటికి అన్ని పనులను పూర్తి చేయాలన్నారు.
పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం : కలెక్టర్
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వివరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉచిత దర్శనంతో పాటు రూ.300, రూ.1,000, రూ.1,500 టికెట్ల వారికి విడివిడిగా క్యూలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చందనోత్సవం రోజున తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో పూజలు మొదలవుతాయని, 3 గంటలకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త తొలి దర్శనం చేసుకుంటారని తెలి పారు. 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తుల రవాణా కోసం 50 ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రత్యేక టికెట్లు కొన్న వారికి మరో 30 మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
గందరగోళం లేకుండా టికెట్ల జారీ ఉండాలి
దర్శన టికెట్ల జారీలో గందరగోళం లేకుండా చూడాలని పలువురు ఎమ్మెల్యేలు సూచించారు. భద్రతా పరంగా విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ సిబ్బందిని, క్రేన్లు, పొక్లెయిన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు(వర్చువల్ విధానంలో), జేసీ విద్యాధరి, ఈవో జె.వెంకటరావు, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, విశాఖ ఆర్డీవో సుధాసాగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


