అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతలు, క్రైం, ట్రాఫిక్ విభాగాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను వాహన యజమానులకు తిరిగి ఇచ్చే కార్యక్రమం మంగళవారం చేపట్టారు. నగర పోలీస్ కమిషనరేట్ పోలీస్ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సంబంధిత యజమానులకు వాహనాలను అప్పగించారు. వివిధ కేసుల్లో, వివిధ సందర్భాలలో సీజ్ చేసిన వాహనాలను వాటి యజమానులు కోర్టుల ద్వారా రిలీజ్ చేసుకోలేకపోతున్నందున అవి పాడైపోతున్నాయన్నారు. ఆ వాహనాలను తిరిగి అందజేయాలని ఉద్దేశంతో ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 5వ సారి చేపట్టిన ఈ కార్యక్రమంలో 413 వాహనాలు అందజేసినట్లు తెలిపారు. మొత్తంగా 5 విడతల్లో 1582 మందికి వాహనాలు అందజేసినట్లు పేర్కొన్నారు.


