వైఎస్ జగన్ హయాంలో
2023లో మాల్‌కు శంకుస్థాపన
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ఫలితమే
ఈ భారీ మాల్
చంద్రబాబువి ‘క్రెడిట్’ రాజకీయాలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికతకు ’ఇనార్బిట్ మాల్’ ఒక సజీవ సాక్ష్యమని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు కొనియాడారు. సోమవారం సాలగ్రామపురంలో జరిగిన మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న కృషిని, ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని ఆయన ఎండగట్టారు.
జగనన్న తెచ్చిన ’గేమ్ ఛేంజర్’
నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదల, ముందుచూపు వల్లే ఈరోజు విశాఖలో ఇంతటి భారీ మాల్ సాకారమైందని కేకేరాజు తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ద్వారా పెట్టుబడిదారులకు ఆయన కల్పించిన భరోసా వల్లే రహేజా గ్రూప్ వంటి దిగ్గజాలు ముందుకు వచ్చాయన్నారు. 2023 ఆగస్టు 1న గత ప్రభుత్వ హయాంలో సుమారు 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.600 కోట్ల భారీ వ్యయంతో ఈ మాల్‌కు పునాది పడిందని గుర్తు చేశారు. ఈ మాల్ ద్వారా ప్రత్యక్షంగా సుమారు మూడు వేల మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఇది విశాఖ ఆర్థిక వ్యవస్థకే ఒక ’గేమ్ ఛేంజర్’ అని అభివర్ణించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని తెలిపారు.
ఐటీ టవర్, భారీ ఉపాధి
మాల్ ప్రాంగణంలోనే సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ కూడా రానుందని, ఇది విశాఖను ఐటీ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ మాల్ ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కల అని చెప్పారు. రూ.600 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో మొదలైన ఈ ప్రాజెక్ట్, రెండో విడతతో మరో రూ.300 కోట్లతో కలిపి విశాఖ ఆర్థిక రంగానికి పెద్ద ఊతాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
క్రెడిట్ కోసం పాకులాట వద్దు
మొక్క నాటిన వారు ఒకరైతే.. కాయలు కోసి క్రెడిట్ కొట్టాలని చంద్రబాబు నాయుడు తంటాలు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అసలు రూపకర్త వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ప్రజలందరికీ తెలుసన్నారు.
అభివృద్ధికి చిరునామా విశాఖ
కేవలం ఇనార్బిట్ మాల్ మాత్రమే కాకుండా, అదానీ డేటా సెంటర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూమి పూజ చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనని కేకే రాజు గుర్తు చేశారు. చిన్న తరహా పరిశ్రమలు, టూరిజం, వినోద రంగాలకు ఈ మాల్ కొత్త ఊపిరి పోస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పారదర్శకతే మా బలం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ ప్రాజెక్టును తీసుకువచ్చినా అందులో అవినీతికి తావు లేకుండా, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారని తెలిపారు. అదానీ డేటా సెంటర్ నుంచి ఇనార్బిట్ మాల్ వరకు ఆయన దార్శనికతకు ఇవన్నీ నిదర్శనాలని కేకే రాజు స్పష్టం చేశారు. కూటమి నాయకులు ఇప్పటికై నా వక్రబుద్ధి మానుకొని, ఈ ఉపాధి అవకాశాలను పారదర్శకంగా యువతకు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.


