ఏసీబీ వలలో లంచావతారం | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో లంచావతారం

Mar 24 2026 6:50 AM | Updated on Mar 24 2026 6:50 AM

లలితానగర్‌ సచివాలయంలో

ఏసీబీ మెరుపుదాడి

రూ.80 వేలు లంచం తీసుకుంటూ

పట్టుబడిన డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ

పైలా రాజేష్‌

తల్లి ఆస్తిని కొడుక్కి సెటిల్‌మెంట్‌ డీడ్‌కు లంచం డిమాండ్‌

సీతంపేట: అతనో ప్రభుత్వ సేవకుడు.. ప్రజలకు అండగా ఉండాల్సిన స్థానంలో ఉన్నాడు. కానీ కళ్లు మూసుకుపోయి కక్కుర్తితో ’చేయి’ చాచాడు. ఐదు సచివాలయాలు కొలువై ఉన్న ఆ ప్రాంగణంలో, వందలాది మంది కళ్లెదుటే ఏమాత్రం భయం లేకుండా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతడే జీవీఎంసీ 26వ వార్డు పరిధి అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జి సమీపంలోని లలితానగర్‌ సచివాలయం (125) వార్డు ఎడ్యుకేషన్‌ కమ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ పైలా రాజేష్‌.

అసలేం జరిగిందంటే?

లలితానగర్‌కు చెందిన ద్వారాపురెడ్డి గంగరాజ్యం తన కుమారుడు గణేష్‌ పేరుపై ఉన్న స్థిరాస్తిని సెటిల్‌మెంట్‌ డీడ్‌ రూపంలో నమోదు చేయించేందుకు లలితానగర్‌ (125) సచివాలయంలో సంప్రదించింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ పైలా రాజేష్‌ మొదట రూ.90 వేల లంచం డిమాండ్‌ చేయగా, చివరికి రూ.80 వేల వద్ద ఒప్పందం కుదిరింది. అయితే లంచం ఇవ్వడానికి ఇష్టపడని గణేష్‌ నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి మార్గదర్శకత్వంలో ప్రణాళిక రచించి.. సోమవారం మధ్యాహ్నం కార్యాలయంలోనే రాజేష్‌కు నగదు అందజేసే సమయంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

‘దర్జాగా’ టేబుల్‌పై డబ్బులు

ఈ ఘటనలో మరో షాకింగ్‌ విషయం ఏమిటంటే.. రాజేష్‌ ఎలాంటి భయం లేకుండా తీసుకున్న లంచాన్ని టేబుల్‌పై బహిరంగంగా ఉంచి, దానిపై బ్యాగ్‌ పెట్టడం. అక్కడే ఐదు సచివాలయాలు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, ప్రజలు ఉండగా కూడా ఇలా నిర్లక్ష్యంగా లంచం తీసుకోవడం చూసి ఏసీబీ అధికారులు సైతం విస్తుపోయారు.

ప్రజల్లో ఆగ్రహం

ఇంత బహిరంగంగా అవినీతి జరుగుతుండటం ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ‘‘ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు, వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం’’ అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తదుపరి చర్యలు

పట్టుబడిన పైలా రాజేష్‌ను ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి, హర్షిత, సీఐలు శ్రీనివాస్‌, వెంకటరావు పాల్గొన్నారు.

అవినీతిపై ఫిర్యాదు ఇలా?

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే, ప్రజలు వెంటనే 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement