బీచ్‌రోడ్డు : పెను విషాదంలోనూ ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగి ధర్మాల మాధవరావు (57) అవయవాలను దానం చేసి, ఆయన కుటుంబ సభ్యులు స్ఫూర్తిగా నిలిచారు. ఈనెల 20న గాజువాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాధవరావు తలకు తీవ్ర గాయమైంది. నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జీవన్ దాన్ ప్రతినిధుల అవగాహనతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో ఆయన శరీరం నుంచి లివర్, కిడ్నీ, రెండు కళ్లను సేకరించి, ప్రోటోకాల్ ప్రకారం సీనియారిటీ లిస్టులో ఉన్న బాధితులకు కేటాయించారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
అవయవ దాతలకు గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలన్న ప్రభుత్వ జీవో ప్రకారం.. మాధవరావు పార్థివ దేహానికి పోలీస్ బ్యాండ్‌తో ఘనంగా నివాళులర్పించారు. సీపీ శంఖబ్రత బాగ్చి, జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె. రాంబాబు స్వయంగా విచ్చేసి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చిన మాధవరావు కుటుంబాన్ని అభినందించారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని, దాతలకు ప్రభుత్వ గౌరవం దక్కడం శుభపరిణామమని పేర్కొన్నారు.
బ్రెయిన్ డెడ్ అయిన
మాధవరావు అవయవాల దానం


