కొంతకాలం ఓపిక పట్టండి.. | - | Sakshi
Sakshi News home page

కొంతకాలం ఓపిక పట్టండి..

Mar 24 2026 6:50 AM | Updated on Mar 24 2026 6:50 AM

● ఉక్కు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం ● కార్మిక సంఘాల సమావేశంలో కేంద్ర మంత్రి కుమారస్వామి

ఉక్కునగరం: కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వచ్చారు.. స్టీల్‌ప్లాంట్‌ను చూశారు.. సమస్యలు విన్నారు.. అన్నింటికీ ఓపిక పట్టాలని చెప్పి వెళ్లిపోయారు. ఇదీ సోమవారం కేంద్ర మంత్రుల పర్యటన స్థూల సారాంశం. నక్కపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా ప్లాంట్‌ శంకుస్థాపనకు వచ్చిన మంత్రులు శనివారం రాత్రి స్టీల్‌ప్లాంట్‌లో బస చేశారు. ఉన్నత యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. వారి పర్యటనతో తమ పెండింగ్‌ జీతాలు, ప్రతీ నెలా పూర్తి జీతం, ఆర్థిక ప్రయోజనాల పునరుద్ధరణ జరుగుతుందని ఉద్యోగులు ఆశపడ్డారు. అయితే వారు ఎటువంటి హామీ ఇవ్వకుండా కొంత కాలం ఓపిక పట్టండి అంటూ చెప్పి ఉద్యోగులను నిరాశలో ముంచెత్తారు.

కార్మిక సంఘాల నాయకులతో సమావేశం

పర్యటనలో భాగంగా మధ్యాహ్నం మంత్రులు కార్మిక సంఘాలు, ఉక్కు అధికారుల సంఘం (సీ), ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, ప్రతీ నెలా పూర్తి జీతాలు చెల్లించాలని, కాంట్రాక్ట్‌ కార్మికుల ఆధార్‌ బ్లాక్‌ తొలగించాలని, ప్లాంట్‌ పూర్తి స్థాయిలో నడపడానికి ఆరవ బ్యాటరీ నిర్మించాలని, సింటర్‌ ప్లాంట్‌ సామర్థ్యం పెంచాలని, మరో రోలింగ్‌ మిల్‌ నిర్మించాలని నాయకులు కోరారు. దీనిపై కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ గత ఏడాదిలో ఉక్కు ఉద్యోగులు చేసిన కృషి అభినందనీయమని, ఊహించిన దాని కన్నా అధికంగా ఉత్పత్తి సామర్థ్యం చూపారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్లతో రెండో ప్యాకేజీ ఇచ్చే అంశం ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలో ఉందన్నారు. కొద్దికాలం ఓపిక పడితే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సమావేశంలో అఖిపక్ష నాయకులు జె.అయోధ్యరామ్‌, పి.వి.రమణమూర్తి, కె.ఎస్‌.ఎన్‌.రావు, యు.రామస్వామి, కొమ్ము ప్రసాద్‌, డొక్క నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అసోసియేషన్లతో

సమావేశం

స్టీల్‌ప్లాంట్‌ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అసోసియేషన్ల నాయకులతో జరిగిన సమావేశంలో నాయకులు దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్‌ సమస్యలను వివరించారు. పదోన్నతుల సమస్య పరిష్కరించాలని, కాంట్రాక్ట్‌ పనుల నుంచి తొలగించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బయ్యే మల్లయ్య, ఓబీసీ అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం వినతి

మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ఉత్తర్వుల జారీ జాప్యం గురించి రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వివరించారు. నెలాఖరవుతున్నా విడుల చేయకపోవడం వల్ల రిటైర్డ్‌ ఉద్యోగులు ఆరోగ్య ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారని అసోసియేషన అధ్యక్షుడు మాటూరి శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement