సీతంపేట: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో అరసం మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభకు అరసం విశాఖ ప్రధాన కార్యదర్శి ఉప్పల అప్పలరాజు అధ్యక్షత వహించగా, బసు పోతన స్వాగతోపన్యాసం చేశారు. ఇదే వేదికపై ప్రముఖ రచయిత కె.ఎన్.వై.పతంజలి కథల పుస్తకాన్ని పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ మాజీ సభ్యులు ప్రొఫెసర్ కె.ఎస్.చలం మాట్లాడుతూ.. పతంజలి కథలను ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. అరసానికి ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉందని తెలిపారు. అభ్యుదయానికి, ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న వైవిధ్యాన్ని సాహితీవేత్తలు సమాజానికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రధాన వక్త, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ.. అరసం 90 ఏళ్ల చారిత్రక ప్రయాణాన్ని వివరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి దిగ్గజాలు అరసం వేదికపై ప్రసంగించారని గుర్తుచేశారు. మనిషిని కేంద్ర బిందువుగా చేసుకునే సాహిత్యం రావాలన్నదే అరసం ఆకాంక్ష అని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ పాఠకులు తగ్గుతున్న ప్రస్తుత రోజుల్లో పఠనాసక్తిని పెంచేందుకు అరసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ ప్రచురించిన కె.ఎన్.వై.పతంజలి కథల పుస్తకాన్ని కథా రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం మిత్ర సాహితీ వర్మ ఈ పుస్తకాన్ని సమీక్షించారు. 1971 నాటి పరిస్థితులను అధ్యయనం చేయాలని, సమాజంలో తాను కోరుకున్న మార్పును పతంజలి తన కథల్లో బలంగా గుప్పించారని ఆయన విశ్లేషించారు. ఈ సభలో అరసం రాష్ట్ర కార్యదర్శి శరత్ చంద్ర జ్యోతిశ్రీ, విశాఖ అధ్యక్షుడు అడపా రామకృష్ణ, సాహితీవేత్తలు శేఖర మంత్రి ప్రభాకర్, డా.డి.వి.సూర్యారావు, ఆచార్య వెలమల సిమ్మన్న, డా.బండి సత్యనారాయణ, పి.శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.


