అల్లిపురం : నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశచూపి నగదు వసూలు చేస్తున్న ముఠా గుట్టును మహారాణిపేట పోలీసులు రట్టు చేశారు. బాధితుడు సాయిసూర్య ఫిర్యాదుతో ఒక మహిళను అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారయ్యారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు మహిళలు కలిసి నిరుద్యోగులకు నెలకు రూ. 30 వేల జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. నగరంలోని నోవాటెల్ సమీపంలో ఉన్న ’బ్లాక్ అండ్ వైట్’ హోటల్‌లో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. నిరుద్యోగుల నుంచి ముందుగా రూ. 5 వేల చొప్పున వసూలు చేశారు. అయితే అదనంగా మరో రూ. 2,500 చెల్లించాలని నిందితులు ఒత్తిడి చేయడంతో బాధితుడు సాయిసూర్యకు అనుమానం వచ్చింది. వెంటనే అతను మహారాణిపేట పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు సదరు హోటల్‌పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఒక మహిళను అదుపులోకి తీసుకోగా, మిగిలిన ముగ్గురు మహిళలు తప్పించుకొని పారిపోయారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిరుద్యోగులు ఇటువంటి మోసపూరిత ప్రకటనలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


