ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ విభాగంలో రైలు వ్యాగన్ ఢీకొని కాంట్రాక్ట్ సూపర్‌వైజర్ మృతి చెందాడు. వివరాలివి.. ప్లాంట్ ట్రాఫిక్ విభాగంలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్న తులసీ ఇంజనీరింగ్ వర్క్స్‌లో కె.సూర్యారావు (68) సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం ఆయన యథావిధిగా విధులకు హాజరయ్యారు. ట్రాఫిక్ విభాగం ప్రధాన కార్యాలయం వెనుక ఉన్న ఎంజీఎం యార్డ్ వద్ద జరుగుతున్న జంగిల్ కటింగ్ పనులను పరిశీలించే నిమిత్తం అక్కడకి వెళ్లారు. అక్కడ ఉన్న ఎమ్–10 ట్రాక్‌పై నిల్చుని పరిశీలిస్తున్నారు. అదే సమయంలో వేగన్ పుషింగ్ జరగడంతో సూర్యారావును వ్యాగన్ ఢీకొంది. దీంతో అతని పైనుంచి వ్యాగన్ వెళ్లిపోవడంతో శరీరం అంతా ముక్కలైంది. సమాచారం అందుకున్న స్టీల్‌ప్లాంట్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఎస్‌ఐ పి.శంకరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


