80 కిలోల గంజాయి స్వాధీనం
తగరపువలస: ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీలోని కంచరాపు కళ్లాల్లో గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. వాహనంలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు ఆనందపురం సీఐ సీహెచ్ వాసునాయుడు, ఎస్‌ఐ బి.శివ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది దాడి చేయగా, గంజాయితో పాటు వాహనాన్ని వదిలి పారిపోవడానికి ప్రయత్నించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన కొర్రా శ్రీను, జి.మాడుగులకు చెందిన దుక్కర్తి రమణమూర్తి, వంతల సూరిబాబు, తూర్పుగోదావరి జిల్లా, ప్రత్తిపాడుకు చెందిన సోమిశెట్టి లోవరాజు ఉన్నారు. వీరిని శుక్రవారం భీమిలి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.


