సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్‌ఆర్‌ఐ సెల్ ప్రారంభం
విశాఖ సిటీ: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం రీజినల్ ఆఫీస్ ఆధ్వర్యంలో శుక్రవారం రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ద్వారకానగర్ శాఖలో ప్రత్యేక ఎన్‌ఆర్‌ఐ సెల్ ప్రారంభించారు. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.వి.మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా నాణ్యతను మెరుగుపరచడం, క్రెడిట్ డెలివరీ వ్యవస్థల బలోపేతం, డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాల విస్తరణపై బ్యాంక్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రిటైల్, ఇతర కస్టమర్లు పాల్గొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ తమ రిటైల్ రుణ పథకాలైన హోమ్, గృహ లక్ష్మీ హోమ్, వెహికల్, విద్యార్థి, మార్టిగేజ్, పర్సనల్ గోల్డ్ లోన్‌లపై పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా కస్టమర్లకు వివరించారు. అర్హత సాధించిన ఖాతాదారులకు ఈడీ ఎం.వి.మురళీకృష్ణ రీజినల్ హెడ్ ఎ.వి.రామణమూర్తి రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ అవుట్‌రీచ్ కార్యక్రమం ద్వారా మొత్తం రూ.32 కోట్లు విలువైన రిటైల్ రుణాలను మంజూరు చేశారు.


